Telugu Gateway
Politics

కరోనాకు సరెండర్ అయిన మోడీ

కరోనాకు సరెండర్ అయిన మోడీ
X

కరోనాపై పోరుకు కేంద్రం వద్ద సరైన ప్రణాళిక లేదని కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ వైరస్ పై పోరాటానికి నిరాకరించటం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ లొంగిపోయారని అన్నారు. దేశంలోని కొత్త ప్రాంతాల్లోనూ కరోనా విస్తృతం అవుతోంది.. ఈ మహమ్మారిని ఓడించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ప్రధాని నరేంద్రమోడీ మౌనంగా ఉన్నారని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా కేసులు ఐదు లక్షలు దాటిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ ప్యానల్ గత రెండు వారాలుగా కనీసం సమావేశాలు నిర్వహించటం లేదని ఓ వార్తాకథనాన్ని కూడా తన ట్వీట్ కు జత చేశారు.

గత 24 గంటల్లో దేశంలో ఏకంగా 18,552 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటేసింది.కాకపోతే మొత్తం బాధితుల్లో 2,95,980 మంది ఇప్పటికే కరోనా నుంచి కోలుకుని ఇంటికెళ్ళారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,97, 387 ఉన్నాయి. కరోనాతో దేశంలో ఇప్పటివరకూ మొత్తం 15600 మంది చనిపోయారు. రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ విషయంతోపాటు లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై మొదటి నుంచి ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నారు.

Next Story
Share it