పది రోజులు అసెంబ్లీ నడపలేని వారు..టెన్త్ పరీక్షలు జరుపుతారా?
రోనా ఉందని చెప్పి పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపలేని వారు..లక్షలాది మంది విద్యార్ధులతో పదవ తరగతి పరీక్షలు నిర్వహించగలరా? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పిల్లలకు రక్షణపై ప్రభుత్వం చట్టపరమైన హామీ ఇవ్వగలదా అని ప్రశ్నించారు. ఏపీ బడ్జెట్ కనికట్టు బడ్జెట్ లా ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్ లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆదాయాన్ని పెంచడానికి చిన్న ప్రయత్నం కూడా జరగలేదన్నారు. అభివృద్ధి లేని సంక్షేమం నీటి బుడగలాంటిది. అవి ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా ఎంతో కాలం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించలేరన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2019 - 20 ) బడ్జెట్ ను రూ. 2.27 లక్షల కోట్ల అంచనాలతో రూపొందించారు. కానీ సవరించిన అంచనాలతో ఆ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసినది రూ.1.74 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. వాస్తవ బడ్జెట్ అంచనాలకు సవరణలకు తేడా రూ.53,217.54 కోట్ల రూపాయలు.
కీలకమైన వ్యవసాయం, ఇరిగేషన్, గృహనిర్మాణాల, వైద్య ఆరోగ్యం లాంటి శాఖల బడ్జెట్ కూ కోతలు విధించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 2020-21 ఆర్థిక సంవత్సరంలోను అంచనాలు భారీగా చూపారు తప్ప ఆచరణ ప్రణాళికలు కనిపించలేదన్నారు. నవరత్నాలను వల్లే వేస్తూ అభివృద్ధిని మరిచిపోయిన మీరు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? గ్రామ వలంటీర్ల నియామకం ద్వారా రెండు లక్షల ఉద్యోగాలను సృష్టించామని చెబుతున్న ఆర్ధిక మంత్రి గారు.. గ్రామ వాలంటీర్లందరూ ప్రభుత్వ ఉద్యోగులే అని ప్రకటించగలరా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.