Telugu Gateway
Telangana

దేశంలో మళ్ళీ లాక్ డౌన్ ఉండదు

దేశంలో మళ్ళీ లాక్ డౌన్ ఉండదు
X

గత కొన్ని రోజులుగా మళ్ళీ లాక్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరగటమే. అయితే ఇదే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ప్రధాని నరేంద్రమోడీ నుంచి క్లారిటీ కోరారు. దీనిపై స్పందించిన మోడీ..లాక్ డౌన్ దశలు ముగిసి..అన్ లాక్ మోడ్ లోకి వచ్చామని..మళ్ళీ లాక్ డౌన్ అనే ప్రశ్న ఉత్పన్నం కాదని స్పష్టంగా చేసినట్లు తెలంగాణ సీఎంవో వెల్లడించింది. ప్రధాని మోడీ బుధవారం నాడు సీఎంలతో కరోనా నివారణ చర్యలపై చర్చించేందుకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అన్ లాక్ 2.O ఎలా అమలు చేయాలన్నదానిపైనే అందరూ కలసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యనించినట్లు తెలిపారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ‘‘కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది. కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉన్నది. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదు అవుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరు వల్ల కరోనా విషయంలో తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం మాకుంది. తెలంగాణలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ కూడా వ్యాప్తి నివారణకు గట్టిగా పనిచేస్తున్నాం.

కొద్ది రోజుల్లోనే వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసం నాకున్నది. మళ్లీ మామూలు జీవితం ప్రారంభమవుతున్నది. వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలకు వెల్లడానికి సిద్ధమవుతున్నారు. వారికి అవకాశం కల్పించాలి. దేశమంతా ఒక్కటే, ఎక్కడి వారు ఎక్కడికి పోయైనా పనిచేసుకునే అవకాశం ఉండాలి. బీహార్ నుంచి హామాలీలు తెలంగాణకు రావడానికి సిద్ధమవుతున్నారు’’ అని సిఎం చెప్పారు. బీహార్ నుంచి వచ్చే హమాలీలను అక్కడి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి సరదాగా స్పందించారు. ‘‘నితీష్ గారు, మేము తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటాం. మా సిఎస్ కూడా మీ బీహార్ వారే. దయచేసి పంపించండి’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it