Telugu Gateway
Andhra Pradesh

లోకేష్ వైపు దూసుకొచ్చిన వెల్లంపల్లి

లోకేష్ వైపు దూసుకొచ్చిన వెల్లంపల్లి
X

ఏపీ శాసనమండలిలో బుధవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలు కీలక బిల్లులకు సంబంధించి హాట్ హాట్ చర్చ సాగుతున్న తరుణంలో ఎమ్మెల్సీ నారా లోకేష్ వైపు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దూసుకురాగా ఆయన్ను బీద రవిచంద్రతోపాటు మరికొంత టీడీపీ ఎమ్మెల్సీలు ఆయన్ను అడ్డుకున్నారు. అక్కడే మంత్రి, సభ్యుల మధ్య తోపులాట..ఘర్షణ జరిగింది. అయితే అధికార వైసీపీ మాత్రం మంత్రిపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేశారని చెబుతుంటే..ప్రతిపక్ష టీడీపీ మాత్రం వీడియోలను బహిర్గతం చేస్తే ఎవరు ఏమి చేశారో ప్రజలు చూస్తారని వ్యాఖ్యానించింది.

సభలో జరిగిన పరిణామాలను ప్రజలకు చూపించాలని ఆ పార్టీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లు మండలి ముందుకు రావటంతో ఎలాగైనా వీటిని అడ్డుకుంటామని ప్రతిపక్ష టీడీపీ ముందు నుంచి ప్రకటించినట్లుగా వ్యవహరించింది. మండలిలో అధికార వైసీపీకి మెజారిటీ లేకపోవటం పెద్ద సమస్యగా మారింది. గతంలోనూ ఈ బిల్లుల విషయంలో మండలిలోనే సమస్యలు తలెత్తాయి. మరోసారి కూడా మండలిలో వీటికి బ్రేక్ పడినట్లు అయింది. వాటితోపాటు అత్యంత కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆగిపోవటం అత్యంత కీలక పరిణామంగా మారింది.

Next Story
Share it