Telugu Gateway
Politics

ఆ మంత్రి ఛాంబర్ లో కెసీఆర్ తోపాటు కెటీఆర్ ఫోటో

ఆ మంత్రి ఛాంబర్ లో కెసీఆర్ తోపాటు కెటీఆర్ ఫోటో
X

శ్రీనివాస్ గౌడ్ ‘ముందు చూపు’

ఎంతైనా మంత్రి శ్రీనివాసగౌడ్ చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి. ఉద్యోగ సంఘాల నేతగా తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో ఉద్యోగులకు సమస్యలు ఎదురైనా ఆయన పెద్దగా పట్టించుకోవటంలేదనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో భాగం కాబట్టి. ఉద్యోగుల కంటే ప్రభుత్వపక్షానే నిలబడుతున్నారు. తప్పదు కూడా. లేకపోతే లెక్క తేడా వస్తుంది. అంతే కాదు..మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందరి కంటే చాలా ముందుచూపుతో వ్యవహారిస్తున్నట్లు పై ఫోటో చూస్తే అర్ధం అవుతుంది. మంత్రి కార్యాలయంలో వెనక గోడ మీద ఓ సారి పరికించి చూడండి. ముఖ్యమంత్రి కెసీఆర్ తోపాటు మంత్రి కెటీఆర్ ఫోటో కూడా ఉంది. సహజంగా మంత్రుల ఛాంబర్లలో ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ప్రధాన మంత్రుల ఫోటోలు ఉంటాయి. ఏ మంత్రి ఛాంబర్ లో ఆ మంత్రి ఫోటోలు సహజం. కానీ శ్రీనివాస్ గౌడ్ చాలా ముందు చూపుతో కెసీఆర్ తో పాటు ఏకంగా కెటీఆర్ ఫోటో కూడా పెట్టేశారు. కారణం అందరికీ తెలిసిందే.

ఆయన సీఎం కెసీఆర్ తనయుడు కావటం..భవిష్యత్ సీఎంగా చెప్పుకోవటం. చెప్పుకోవటమే కాదు..ఇదే శ్రీనివాసగౌడ్ సీఎం అయ్యేందుకు కెటీఆర్ కు మించి అర్హతలు ఉన్న వారు ఎవరు అంటూ కొద్ది రోజుల క్రితం ప్రశ్నించారు కూడా. బుధవారం నాడు తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు గా కారం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గా మామిళ్ల రాజేందర్ లు మూడో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షురాలు వి. మమత, తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి శ డి.హనుమంతు నాయక్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని పేర్కొన్నారు. రానున్న కొద్దీ రోజులలో ఉద్యోగుల పదవి విరమణ వయో పెంపు పై కీలక నిర్ణయం ప్రకటిస్తారన్నారు.

Next Story
Share it