హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య
షాకింగ్. ధోనీ బయోపిక్ సినిమా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కలకలం రేపుతోంది. సుశాంత్ వయస్సు 34 సంవత్సరాలే. ఈ యువ హీరో ముంబయ్ లోని తన ఇంట్లో ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారన్నది తెలియాల్సి ఉంది. ‘కోయ్ పో చి’తో కెరీర్‌ను ఆరంభించిన సుశాంత్ ఆ తర్వాత ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టీవ్ బొమ్‌కేష్ బక్షి’, ‘ఎం.ఎస్.ధోనిః ద అన్‌టోల్డ్ స్టోరీ’, ‘రాబ్టా’, ‘వెల్‌కమ్ న్యూయార్క్, ‘కేదార్‌నాథ్’, సోంచారియా, ‘చిచ్చోర్, డ్రైవ్’ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే సరిగ్గా నాలుగు రోజుల క్రితం సుశాంత్ సింగ్ దగ్గర మేనేజర్‌గా పని చేసిన దిశ సలియా కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ముంబయ్ లో తన భవనంలోని 14వ అంతస్థు పైనుంచి దూకింది. తీవ్ర రక్తస్రావమైన ఆమెను వెంటనే బొరివలిలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మానసిక ఒత్తిడితో సుశాంత్ చనిపోయి ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన గదిలో మాత్రం ఎలాంటి నోట్ కూడా దొరకలేదని పోలీసులు తెలిపారు.