Telugu Gateway
Telangana

కెటీఆర్ ఫాంహౌస్ పై ఎన్జీటీ నోటీసులు

కెటీఆర్  ఫాంహౌస్ పై  ఎన్జీటీ నోటీసులు
X

నిజానిజాల నిర్ధారణకు కమిటీ..రెండు నెలల్లో నివేదికకు ఆదేశం

తెలంగాణ పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ కు చెందిన ఫాం హౌస్ కు సంబంధించిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చట్టాలను రక్షించాల్సిన మంత్రే చట్టాలకు తూట్లు పొడిచి ఫాంహౌస్ నిర్మించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఆ ఫాంహౌస్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరేశారనే కారణంతో కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి..జైలుకు కూడా పంపారు. ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త ట్విస్ట్ తీసుకుంది. తాజాగా చెన్నయ్ కు చెందిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీటీ) మంత్రి కెటీఆర్ తోపాటు తెలంగాణ సర్కారుకు కూడా నోటీసులు జారీ చేసింది.

రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆదారంగా ఈ నోటీసులు జారీ చేశారు. 111 జీవో పరిధిలో కెటీఆర్ చేపట్టిన నిర్మాణాలను పరిశీలించి ఇవి సక్రమమా కాదా తేల్చేందుకు ఎన్జీటీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ రిజిస్ర్టీ కార్యాలయం, కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, హెచ్‌ఎండీఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ల సారథ్యంలో ఏర్పాటయ్యే ఈ కమిటీ రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 2018లో 111 జీఓ కేసు విషయంలో ఎన్‌జీటీ ఆదేశాలను యథాతథంగా అమలుచేస్తున్నారా అనే అంశాన్ని ఈ కమిటీ పరిశీలించాలని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోరింది.

Next Story
Share it