Telugu Gateway
Andhra Pradesh

లక్షణాలు ఉన్న ఎంత మందికైనా పరీక్షలు చేస్తాం

లక్షణాలు ఉన్న ఎంత మందికైనా పరీక్షలు చేస్తాం
X

గాంధీ..కింగ్ కోఠి ఆస్పత్రులకే రండి..మేం రక్షిస్తాం

కరోనాతో ఇబ్బంది పడే వారంతా గాంధీ, కింగ్ కోఠితో సహా ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. ఇతర ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని..ఎంత ఖర్చు అయినా భరించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తామన్నారు. ఈటెల రాజేందర్ బుదవారం నాడు టిమ్స్ లో మీడియాతో మాట్లాడారు. కొంత మంది గాంధీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ మాత్రం బాధ్యతలేని వాళ్లే ఇలాంటి పనులకు పాల్పుడుతున్నారని..బాధ్యత గల వాళ్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఆరోగ్య రంగం విషయంలో కేరళ, తమిళనాడుతో తెలంగాణ పోటీపడుతోందని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ లో ఏదో అవుతుందని దుష్ప్రచారం చేయటం సరికాదన్నారు. వైద్యుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. లక్షణాలు లేనివారు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆస్పత్రులకు రావొద్దని అన్నారు. దీనివల్ల కరోనా పేషంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

లక్షణాలు ఉంటే ఎంతమందికైనా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. టెస్టుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని అన్నారు. ప్రజారోగ్యం విషయంలో రాజీపడబోమని తెలిపారు. త్వరలోనే గచ్చిబౌలీలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ అండ్‌‌ రీసెర్చ్‌ (టిమ్స్‌)ను ప్రారంభిస్తామని చెప్పారు. టిమ్స్‌ లో 1264 పడకలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. 1000 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం, 50 పడకలకు వెంటిలేటర్ సౌకర్యం ఉందన్నారు. టిమ్స్‌ లో ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, నాలుగైదు రోజుల్లో ఇన్‌పేషంట్‌లకు చికిత్స ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో ఏరియా ఆస్పత్రుల్లోనూ ఐసీయూలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కరోనాతో చనిపోయిన వారు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందిపడిన వారు మాత్రమే అన్నారు.

Next Story
Share it