కరోనా వ్యాక్సిన్ తయారీ లో కీలక దశకు భారత్ బయోటెక్

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కీలక పురోగతి సాధించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించింది. దీంతో కంపెనీ మానవులపై మొదటి దశ, రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. ఈ ట్రయల్స్ జులై నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలీలో ఉన్న యూనిట్ లో ఈ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియ సాగుతోంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు ఈ వ్యాక్సిన్ తయారీలో తమ వంతు సహకారం అందిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియలో సాధించిన పురోగతిని భారత్ బయోటెక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ క్రిష్ణ ఎల్లా వెల్లడించారు. ఇది దేశీయంగా తయారవుతున్న తొలి కరోనా వ్యాక్సిన్ అని ఒక ప్రకటనలో తెలిపారు. తాము జరిపిన ప్లీ క్లినికల్ స్టడీస్ లో ఎంతో మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఎంతో సురక్షితం అని, ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు తేలిందని వెల్లడించారు.