Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ వాళ్ళది శునకానందమే

టీడీపీ వాళ్ళది శునకానందమే
X

ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రజలకు మేలు జరగటం ఏ మాత్రం ఇష్టంలేదని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అందుకే మండలిలో టీడీపీ సభ్యులు ఇష్టానుసారం వ్యవహరించారని ఆయన విమర్శించారు. బుధవారం మండలిలో నిబంధనలకు విరుద్ధంగా నారా లోకేష్‌ ఫొటోలు తీశారని, శాసనమండలి ఛైర్మన్ స్వయంగా చెప్పినా లోకేష్ వినలేదని అన్నారు. ఫొటోలు తీయోద్దన్న తనపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేశారని చెప్పారు. తనతో పాటు మంత్రులు కన్నబాబు, గౌతమ్ రెడ్డిలపై కూడా దాడికి పాల్పడ్డారని అన్నారు. తనపై దాడికి నారా లోకేష్ ప్రోద్బలమే కారణమన్నారు. టీడీపీ సభ్యులు మండలిలో గుండాలుగా, రౌడీలుగా వ్యవహరించారన్నారు. టీడీపీ సభ్యుల తీరుతో మండలికి వెళ్లాలంటేనే బాధగా ఉందన్నారు. తమపై దాడికి పాల్పడ్డ బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలపై ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీసిన లోకేష్‌పైనా చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చర్చించని టీడీపీ.. మండలిలో మాత్రం బిల్లులను అడ్డుకుంటున్నారు.

మండలిలో అంగబలం ఉంది.. సంగతి చూస్తామంటున్నట్టు టీడీపీ వ్యవహరించింది. మండలి ఛైర్మన్ గతంలో రూల్సుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఛైర్మన్ స్థానంలో కూర్చుని డిప్యూటీ ఛైర్మన్ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. గన్ మెన్లను తొలగించారంటూ డిప్యూటీ ఛైర్మన్ చైరులో కూర్చొని కామెంట్లు చేయడం సరి కాదు. చైర్ లో కూర్చున్న డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం టీడీపీ వాళ్లని మా వాళ్లని సంబోధిస్తున్నారు. రూల్ 90 కింద చర్చకు అడ్మిట్ చేయకుండానే యనమల మాట్లాడేశారు. తాను చర్చకు అనుమతించ లేదని మండలి ఛైర్మన్ కూడా స్పష్టంగా చెప్పారు. డిమాండ్ల మీద మంత్రులే సమాధానం చెప్పాలి కాబట్టి మండలికి వెళ్లాం. బిల్లులను కొన్నాళ్ల పాటు ఆపి శునకానందం పొందగలరు తప్ప.. లాభం ఏముంటుంది..?. ప్రజల కోసం మేం భరిస్తున్నాం.. మేం తిరగబడితే తట్టుకోలేరు.’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

Next Story
Share it