Telugu Gateway
Andhra Pradesh

ఏపీ మండలిలో మంత్రి వెల్లంపల్లిపై దాడి

ఏపీ మండలిలో మంత్రి వెల్లంపల్లిపై దాడి
X

ఏపీ మండలిలో అసాధారణ పరిణామాలు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బుధవారం నాడు అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అత్యంత కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదానికి నోచుకోకుండా మండలి అసాదారణంగా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుతోపాటు పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు తదితర బిల్లుల ఆమోదం పొందకుండానే మండలి నిరవధికంగా వాయిదా పడింది. ఈ బిల్లులపై చర్చోపచర్చల సందర్భంగా ఓ దశలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై కొంత మంది ఎమ్మెల్సీలు దాడి చేశారు. తోపులాట..గొడవ జరిగిందని మంత్రి కన్నబాబు తెలిపారు. నారా లోకేష్ సభలో ఫోటోలు తీస్తుంటే వద్దని వారించినా కూడా వినకుండా ముందుకు సాగారన్నారు. వెల్లంపల్లిపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మరికొంత మంది దాడి చేశారని కన్నబాబు తెలిపారు. మండలిలో బుధవారం నాడు జరిగిన పరిణామాలు దుర్దినం అని కన్నబాబు వ్యాఖ్యానించారు. ఆ సభలో మీకు మెజారిటీ ఉందని ఆమోదించుకుంటున్నారు..కానీ ఈ సభలో అలా జరగదని యనమల రామకృష్ణుడు చెప్పారని..కావాలంటే రికార్డుల్లో చూసుకోవచ్చని అన్నారు.

టీడీపీకి ప్రజా ప్రయోజనం పట్టదని కన్నబాబు విమర్శించారు. అంతకు ముందు మండలిలో సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు తెలుగుదేశం సభ్యులు ఎక్కువగా ఉన్నారని ఇష్టానాసారం చేశారని విమర్శించారు. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు ఎలా సభ జరగకుండా అడ్డుకోవాలని చూశారని ఆయన విమర్శించారు. నిబంధనల ప్రకారం రూల్ 90 కింద సభలో చర్చకు రావాలంటే ఒక రోజు ముందు నోటీసు ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలు పట్టించుకోకుండా ఛైర్మన్ అడ్మిట్ అని రాసి..వెళ్లిపోయారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందితే తప్ప..జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బందిలో పెట్టాలనే వ్యవహరించారు. రాజకీయానికే అత్యంత ప్రాధాన్యత ఇఛ్చారు తప్ప..రాష్ట్ర అవసరాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని సీఎం జగన్ కోరుకుంటుంటే..టీడీపీ వాళ్లకు మాత్రం 33 వేల ఎకరాల్లో సామ్రాజ్యం అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నారు.

యనమల రూల్స్ బుక్ పట్టుకుని వస్తారు కానీ..వాటిని మాత్రం అసలు పాటించరు. కండ కావరంతో ఏమైనా చేద్దామనుకుంటున్నారు. మా మాట సాగకపోతే విధ్వంసం చేస్తామని యనమల వ్యాఖ్యానించారన్నారని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అలా విధ్వంసాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. డిప్యూటీ ఛైర్మన్ సాగదీసి..సాగదీసి వాయిదా వేసి వెళ్ళిపోయాడు. టీడీపీ ఎలా చెపితే అలా సభ నడపాలి అన్న చందంగా వ్యవహరించాలి. అప్రాప్రియేషన్ బిల్లుకు కూడా ఆమోదం చేయకుండా వెళ్ళటం అంటే చాలా దురదృష్టకరం. ఇంతకంటే ఘాతుకమైన చర్య మరోకటి లేదు. చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. అంతకు ముందు ఉమ్మారెడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కౌన్సిల్ లో జరిగిన సంఘటనలు మీ దృష్టికి కొన్ని వచ్చి ఉంటాయి. లెజిస్లేచర్ చరిత్రలో దురదృష్టకరమైన సంఘటనలు గతంలోఎన్నడూ జరిగి ఉండవని వ్యాఖ్యానించారు.

Next Story
Share it