వైసీపీది ’కరోనా ఫ్రెండ్లీ’ ప్రభుత్వం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో మద్యం విక్రయాల అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ సర్కారు ‘కరోనా ఫ్రెండ్లీ’ ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా చేశారు. వైసీపీ తాము అధికారంలోకి వస్తే మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని ప్రకటించిందని..కాకపోతే తర్వాత దశల వారీ నిషేధం అని పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్రంలో లిక్కర్ షాపులు తెరవటం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు జరగటం బాధాకరం అని పేర్కొన్నారు.ఈ ట్వీట్ కు ఓ వార్తాపత్రిక క్లిప్పింగ్ ను కూడా పవన్ కళ్యాణ్ జతచేశారు. ప్రభుత్వ ఉపాధాయుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయోద్దని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. వైన్ షాపుల వద్ద టీచర్లకు బాధ్యతలు అప్పగించటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మద్యానికి సంబంధించి ఏపీలో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి పవన్ కళ్యాణ్ వరస ట్వీట్లు చేశారు. చిత్తూరు జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా కూడా పవన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇంతకాలంపాటు పాటించిన లాక్ డౌన్ నియమాలను, ఆ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి మంటగలిపేసింది అన్నారు. అన్ని వర్గాల ప్రజలు వ్యక్తిగత దూరం పాటించాలనే ఉద్దేశంతో దేవాలయాలకీ, మసీదులకు, చర్చిలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే- ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాలను తెరిచి వ్యక్తిగత దూరం అనే నియమాన్ని తుంగలో తొక్కేసింది అని చెప్పారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి లాంటి చోట్ల ప్రజా ప్రతినిధులు చేసిన ర్యాలీలు, బహిరంగ కార్యక్రమాలు వారెంత బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారో వెల్లడిస్తున్నాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “తిరుమల శ్రీవారి దర్శనం ఇంతకాలం పాటు భక్తులకు దూరం అవుతుందని ఊహించం. అలాంటి ఆరోగ్య విపత్తు వచ్చింది. చిత్తూరు జిల్లాలో 70శాతం కేసులు ఒక్క శ్రీకాళహస్తిలోనే ఉన్నాయి. ఈ జిల్లాలో ప్రజా ప్రతినిధులు చేపట్టిన కార్యక్రమాలను జాతీయ మీడియా విమర్శించింది. ప్రజా ప్రతినిధుల చర్యలు చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. మామిడి రైతులు కరోనా మూలంగాను, అకాల వర్షాలు, గాలి దుమారంతో నష్టాల పాలయ్యారు. టమోటా రైతులకు కనీసం కూలీ ఖర్చులు కూడా దక్కే అవకాశం లేదు. రైతాంగం దుస్థితిపై అన్ని వివరాలు తీసుకుంటున్నాం. సమగ్ర నివేదికను కేంద్రానికి అందిస్తాం” అన్నారు.