Telugu Gateway
Telangana

నీటిపారుదల జోన్లు ఏర్పాటు..కెసీఆర్

నీటిపారుదల జోన్లు ఏర్పాటు..కెసీఆర్
X

నీటిపారుదల శాఖను పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంభించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కెసీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. ‘ భారీ, మధ్య తరహా, చిన్న తరహా నీటి పారుదల, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని విభాగాలు, ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందికి రావాలి. అన్నీ నీటి పారుదల శాఖ పరిధిలోనే ఉండాలి. ప్రాజెక్టులు, వాటి భౌగోళిక స్థితి ఆధారంగా నీటి పారుదల శాఖను పునర్వ్యవస్థీకరించాలి. సిఈ/ఈఎన్ సీ పరిధులు నిర్ణయించి, నీటి పారుదల జోన్లు ఏర్పాటు చేయాలి. అత్యవసరమైన సాగునీటి పనులకు కావాల్సిన అనుమతులు ఇవ్వడానికి సిఈ నుంచి ఈఈ వరకు అధికారాలను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. సిఈ 50 లక్షల వరకు ఎస్ఈ 25 లక్షల వరకు, ఈఈ 5 లక్షల వరకు పనులకు అనుమతులు ఇవ్వవచ్చు. 15 రోజుల్లోగా అన్ని ప్రాజెక్టులపై కొత్తగా గేజ్ మీటర్లు ఏర్పాట్లు చేయాలి.

ప్రస్తుతమున్న గేజ్ లు చాలా కాలం క్రితం ఏర్పాటు చేసివని. చాలా ప్రాజెక్టుల్లో పూడిక వల్ల గేజ్ లు సరిగా చూపెట్టడం లేదు. కొత్తగా గేజ్ లు ఏర్పాటు చేసి ఖచ్చితమైన అంచనా వేయాలి. నీటి పారుదల శాఖ భూములు, ఆస్తుల వివరాలతో ఓ నివేదిక తయారు చేయాలి. నీటి పారుదల శాఖ సేకరించిన భూములను వెంటనే మ్యుటేషన్ చేయించాలి. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూమిని ఇతరులు ఆక్రమిస్తున్నారు. వాటిపై సీరియస్ గా ఉండాలి. రాష్ట్రంలో చాలా చోట్ల, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాల్వ కట్టలపై నిర్మాణాలు వచ్చాయి. ఇది నేరమేకాకుండా, ప్రమాదకరం కూడా. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని కాలువల్లో నీరు వస్తాయి కాబట్టి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాలువలపై నివాసం ఉండే వారు తక్షణం ఖాళీ చేయాలి. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను తొలగించాలి. ఎంతో వ్యయం చేసి ప్రాజెక్టులు నిర్మించాం.

వాటిని సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ప్రతీ ప్రాజెక్టు నిర్వహణ కోసం ఓ అండ్ ఎం మాన్యువల్ రూపొందించాలి. ప్రతీ ఏటా బడ్జెట్లోనే నిర్వహణ వ్యయం కేటాయించి, క్రమం తప్పకుండా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇంకా ఎక్కడైనా ఏమైనా భూసేకరణ మిగిలి ఉంటే, తక్షణం పూర్తి చేయాలి. దీనికి కావాల్సిన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ’ అని కెసీఆర్ తెలిపారు. వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరంలో మూడో టిఎంసి ఎత్తిపోసే పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టిఎంసిని వాడుకోవాలన్నారు.

Next Story
Share it