Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

తెలంగాణ సర్కారు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
X

ప్రభుత్వం నిర్ణయించిన కేంద్రాల్లోనే ప్రజలు కరోనా పరీక్షలు, చికిత్స చేయించుకోవాలని చెప్పటం రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ప్రజలపై ఎలాంటి ఒత్తిడి చేయరాదని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ కేంద్రాల్లో డబ్బులు చెల్లించి పరీక్షలు చేయించుకునే హక్కు ప్రజలకు ఉందని వ్యాఖ్యానించింది హైకోర్టు. అయితే ఆ ల్యాబ్ లు, ఆస్పత్రులు విధిగా ఐసీఎంఆర్ ఆమోదం పొంది ఉండాలని స్పష్టం చేసింది. ఐసీఎంఆర్ ఆమోదం ఉన్న ల్యాబ్ ల్లో, ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించాలని తెలంగాణ సర్కారును హైకోర్టు ఆదేశించింది. గాంధీ, నిమ్స్ తోపాటు ప్రభుత్వం నిర్ణయించిన చోటే చికిత్సలు చేయించుకోవాలనటం సరికాదని స్పష్టం చేసింది. ఆర్ధికంగా వెసులుబాటు ఉన్న వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటే సర్కారుకు ఇబ్బంది ఏముంది అని ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చికిత్సకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గంటా విజయ్ కుమార్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ సడలింపులతో కరోనా పెరిగే అవకాశం ఉందని.. ఈ తరుణంలో ప్రైవేట్ భాగస్వామ్యం కూడా అవసరం అవుతుందని పేర్కొన్నారు.

లక్షణాలు ఉన్న వారికే ప్రభుత్వం పరీక్షలు చేస్తోందని..అనుమానం ఉన్న వారు కూడా ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బు చెల్లించి చికిత్సలు చేయించుకుంటే ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుంది కదా అని ప్రశ్నించింది. దీని వల్ల ప్రభుత్వంపై భారం తగ్గటమే కాకుండా..పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం దక్కుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రైవేట్ లో కరోనా చికిత్సలు అంటే దుర్వినియోగం అవకాశం ఉందని..లెక్కలు కూడా దాచిపెడతారని సర్కారు చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రులపై నమ్మకం లేకపోతే ఆరోగ్య శ్రీ పథకాలను ఎలా అనుమతించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Next Story
Share it