Telugu Gateway
Telangana

తెలంగాణలో కరోనా టెస్ట్ ల తీరుపై కేంద్రం ఆగ్రహం

తెలంగాణలో కరోనా టెస్ట్ ల తీరుపై కేంద్రం ఆగ్రహం
X

సీఎస్ కు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ

ఏపీలో రోజుకు 9000, తెలంగాణలో 200 టెస్ట్ లు

తెలంగాణలో కరోనా టెస్ట్ ల తీరుపై కేంద్రం అసంతృప్తితో ఉందా?. అంటే ఔననే చెబుతోంది ‘ది ప్రింట్’ వెబ్ సైట్. అంతే కాదు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ టెస్ట్ ల విషయంలో తెలంగాణ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన విషయాన్ని కూడా ఈ వెబ్ సైట్ వెలుగులోకి తెచ్చింది. మే 7 వరకూ దేశ వ్యాప్తంగా 14 లక్షల శాంపిళ్లను పరీక్షించగా..అందులో తెలంగాణ వాటా కేవలం 1.5 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో జాతీయ సగటు కంటే పాజిటివ్ రేటు తెలంగాణలో ఎక్కువ ఉందని తెలిపారు. కరోనా టెస్ట్ ల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించకపోవటం రాష్ట్రంలో వైరస్ నియంత్రణకు ఏ మాత్రం ఉపయోగపడదని కేంద్రం ఆక్షేపించింది. ‘కరోనా వైరస్ ప్రజల వెంటపడే వరకూ ఆగకుండా..మనమే వైరస్ ను నియంత్రించాలి’ అని సూడాన్ తన లేఖలో వ్యాఖ్యానించారు. సూడాన్ మే 7న తెలంగాణ సీఎస్ కు లేఖ రాసినట్లు ప్రింట్ కథనంలో పేర్కొన్నారు. తక్షణమే పరిస్థితిని సమీక్షించి టెస్ట్ ల సంఖ్యను పెంచాల్సిందిగా కూడా కేంద్రం ఆదేశించింది.

ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టెస్ట్ లు చాలా తక్కువగా ఉన్నాయన్న అంశాన్ని కూడా సూడాన్ తన లేఖలో ప్రస్తావించారు. సూడాన్ లేఖపై వివరణ కోరేందుకు సీఎస్ తో మాట్లాడేందుకు ప్రయత్నించగా..ఆయన అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ మాత్రం తెలంగాణ టెస్ట్ ల తీరును సమర్ధించుకున్నారని..ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వారందరికీ టెస్ట్ లు చేస్తున్నట్లు తెలిపారు. మెరుగ్గా కాంటాక్ట్ ట్రేసింగ్ వల్లే అధిక పాజిటివ్ రేటు వచ్చిందనే విషయాన్ని ఈటెల తెలిపారన్నారు. మంత్రి ఈటెల ట్విట్టర్ లో ప్రస్తావించిన అంశాలను కూడా ఈ కథనంలో పేర్కొన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలతోనే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రా తో పోల్చినా కూడా తెలంగాణ ఎంతో వెనకబడి ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో సగటున రోజుకు 9000 టెస్ట్ లు చేస్తుంటే..తెలంగాణ లో కేవలం 200 మాత్రమే చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపినట్లు ప్రస్తావించారు. ఏప్రిల్ 30-మే 6 కాలం మధ్యలో జాతీయ సగటు కంటే తెలంగాణలో చేస్తున్న కరోనా టెస్ట్ లు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. పరీక్షల జాతీయ సగటు మిలియన్ కు 1025 మంది ఉంటే...తెలంగాణలో మాత్రం కేవలం 546 మాత్రమే ఉందన్నారు. తెలంగాణలో టెస్ట్ లు చేసేందుకు కేంద్రం 20 ల్యాబ్ లకు అనుమతి ఇఛ్చినా కూడా ప్రైవేట్ ల్యాబ్ లను టెస్ట్ లకు ఉపయోగించుకోలేదన్నారు. ప్రభుత్వ ల్యాబ్ లు 9ఉంటే..11 ల్యాబ్ లు ప్రైవేట్ రంగానివి అని సూడాన్ తన లేఖలో ప్రస్తావించారు.ఈ లెక్కన ల్యాబ్ లను కూడా సరిగా వాడుకోలేదనే విషయం అర్ధం అవుతుందని అన్నారు.

Next Story
Share it