Telugu Gateway
Politics

బస్సులు అన్నీ తెలంగాణలోనే తిరుగుతాయి

బస్సులు అన్నీ తెలంగాణలోనే తిరుగుతాయి
X

హైదరాబాద్ లో సిటీ బస్సులకు నో

అన్ని షాపులు...పరిశ్రమలు పూర్తి స్థాయిలో పనిచేసుకోవచ్చు

కంటైన్ మెంట్ జోన్లలోనే ఆంక్షలు

హైదరాబాద్ లో కూడా క్యాబ్ లు, ఆటోలకు గ్రీన్ సిగ్నల్

రాత్రివేళ్ళలో కర్ఫ్యూ కొనసాగుతుంది

మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన కెసీఆర్

కేంద్రం జారీ చేసిన లాక్ డౌన్ మినహాయింపు మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ కేబినెట్ సోమవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను ముఖ్యమంత్రి కెసీఆర్ మీడియాకు వివరించారు. ‘ లాక్ డౌన్ ను తెలంగాణలో మే 29 నుంచి మే 31 వరకూ పొడిగిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. కంటైన్ మెంట్ జోన్లు తప్ప..రాష్ట్రం అంతటా గ్రీన్ జోనే . 1452 కుటుంబాలు మాత్రమే కంటైన్ మెంట్ జోన్ లో ఉన్నాయి. దేశమంతటా గమనిస్తుంటే ఇండియా బ్యాక్ టూ వర్క్ అని వార్తలు వస్తున్నాయి. మనం కూడా మనకు అనుకూలమైన పద్దతిని ఎంచుకున్నాం. మనం కూడా ముందుకు పోవాలి. కరోనాకు మందు..వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే వచ్చేది లేదు. ఎన్ని మాసాలు కొనసాగుతుందో అనిశ్చితి పరిస్థితి ఉంది. ఇటు వంటి పరిస్థితుల్లో కరోనాతో కలసి జీవించటం నేర్చుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటూ...బతుకు కొనసాగాల్సిందే. బతుకు బంద్ పెట్టుకుంటే కష్టం అవుతుంది.

రాష్ట్రంలో కంటైన్ మెంట్ జోన్లు తప్ప....హైదరాబాద్ లో తప్ప..అన్ని రకాల షాప్ లు తెరుచుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎలా చేయాలో ప్రకటిస్తారు. ఆల్టర్నేటివ్ షాపులు తెరుచుకోవచ్చు. కంటైన్ మెంట్ ఏరియాలో మాత్రం అది కూడా ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు మంగళవారం నుంచి నడుస్తాయి. సిటీ బస్సులకు నో. అంతర్ రాష్ట్ర సర్వీసులు కూడా నో. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు పోవు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి రావు. రాష్ట్రంలోనే ఆర్టీసీ బస్సులు. సిటీలో ఆటోలు..ట్యాక్సీలు అనుమతిస్తారు ట్యాక్సీలో వన్ ప్లస్ త్రీ..ఆటోలో కూడా నిబంధనల మేరకే. సెలూన్లు రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకోవచ్చు. హైదరాబాద్ లో కూడా. ఈ కామర్స్ వంద శాతం అనుమతి. ఎలాంటి ఆంక్షలు లేవు. ఆర్టీసీ బస్సులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నడుపుతారు.

మాస్క్ తప్పనిసరి. సిబ్బంది, ప్రయాణికులు మాస్క్ లు ధరించాల్సిందే. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు వంద శాతం స్టాఫ్ తో పనిచేసుకోవచ్చు. అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా తెరుచుకోవచ్చు. కర్ఫ్యూ యతాతధంగా కొనసాగుతుంది. మే 31 వరకూ. అన్ని మతాల ప్రార్ధనా మందిరాలు బంద్ ఉంటాయి. ఎవరూ తెరవరు. ఉత్సవాలు కూడా బంద్ ఉంటాయి.సభలు, ర్యాలీలు.సమావేశాలు అనుమతించరు. అన్ని రకాల విద్యా సంస్థలు బంద్ ఉంటాయి. బార్లు, పబ్బులు..క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్స్, స్టేడియాలు, పార్కులు అన్నీ బంద్. వాటిని తెరిచే ప్రసక్తే లేదు. మెట్రో రైలు కూడా బంద్ ఉంటుంది. మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు. మాస్క్ లు అందరూ ధరించాలి. ఎవరికీ మినహాయింపు ఉండదు. భౌతికదూరం పాటించాలి. మన కోసమే ఇది. షాపులు శానిటైజ్ చేసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి. ప్రజలు దయచేసి రోడ్ల మీదకు వచ్చి హంగామా చేయవద్దు. అవసరం ఉన్న వారు మాత్రమే రండి. నియంత్రణ పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఎవరికి వారే నియంత్రణ పాటించాలి. 65 సంవత్సరాలు దాటిన వారు బయట తిప్పొద్దు. ఇప్పటివకూ సహకరించిన ప్రజలకు చేతులెత్తి ధన్యవాదాలు చెబుతున్నా. త్వరలోనే మనం బయటపడొచ్చు. స్వీయనియంత్రణ పాటించి. కరోనా రాక్షస బారిన పడకుండా కాపాడుకుందాం.’ అని కెసీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it