Telugu Gateway
Politics

సోషల్ మీడియానే మన బలం

సోషల్ మీడియానే మన బలం
X

‘ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలు, జనసేన ప్రస్తావించిన అంశాలు పత్రికలు, టీవీ మాధ్యమాల్లో తగిన విధంగా రావడం లేదని ఎవరూ భావించవద్దు. మనకు ఉన్న బలం సోషల్ మీడియా. ఆ విషయాన్ని మరువవద్దు. ట్విటర్ హ్యాండిల్ ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్యను తెలియచేశాం. సత్వరం స్పందించారు. ఏ పత్రికలో వచ్చిందని వారు స్పందించారు? సోషల్ మీడియా ద్వారానే ఆ సమస్యను తెలిపి స్పందింపచేశాం. మనం చిత్తశుద్ధితో పని చేస్తూ వెళ్దాం. మన కార్యక్రమాలను తెలిపేందుకు, సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు సోషల్ మీడియాను సమర్థంగా వాడుకుందాం” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఒప్పంద ఉద్యోగులకు, పూర్తి స్థాయి వేతనాలు అందక ఇబ్బందిపడుతున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. రాష్ట్రంలో ప్రజలు భారీగా వచ్చిన విద్యుత్ బిల్లుల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

లాక్ డౌన్ సడలింపుల తరవాత మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు అనుగుణంగా సమాయత్తం కావల్సిన అవసరం ఉంది. నాలుగైదు నెలల్లో వ్యాక్సిన్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అదుపులోకి వచ్చేందుకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ళు పట్టవచ్చని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “అదృష్టవశాత్తూ శ్రీకాకుళం జిల్లాలో తక్కువ కేసులే ఉన్నాయి. ఇకపైనా అప్రమత్తంగా ఉండాలి. టెస్టులను ఎప్పటికప్పుడు చేస్తూ వైరస్ సోకిన వారిని గుర్తించాలి. లాక్ డౌన్ న్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తమ రాజకీయ ప్రచారానికి వాడుకొంటున్నారు. మన నాయకులు, శ్రేణులు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు” అన్నారు.

Next Story
Share it