Telugu Gateway
Politics

మీడియాకు రేవంత్ రెడ్డి వార్నింగ్

మీడియాకు రేవంత్ రెడ్డి వార్నింగ్
X

తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా మీడియా ఇలాగే వ్యవహారిస్తే ఆ మీడియాను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఎంత ముఖ్యమైన అంశంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడినా మీడియాలో కనీస ప్రాధాన్యత దక్కటంలేదని..ఇదే పరిస్థితి ఉంటే తాము కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సమీక్షించుకుని ఏమి చేయాలో అది చేస్తామని తెలిపారు. తమ వార్తలు రాని టీవీలు తమ ఇళ్ళలో ఎందుకు పెట్టుకుంటామని..తమ వార్తలు రాయని పత్రికలు తమకెందుకు అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై తాము పోరాడుతుంటే కనీసం చిన్న చిన్న వార్తలు రావటంలేదని..దీంతో అసలు కాంగ్రెస్ పార్టీ ఏమి చేయటంలేదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ రెండు గంటల ప్రెస్ మీట్ పెడితే మొత్తం లైవ్ లో చూపించారని..అందులో ఎక్కువ శాతం కాంగ్రెస్ ను తిట్టడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. చూపిస్తే చూపించారు..కాంగ్రెస్ వార్తలు ఎందుకు కవర్ చేయరని మీడియాను ప్రశ్నించారు. కెసీఆర్ కు ఎంత కాలి అంటే తమను అంతగా తిట్టాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ వార్తలు ఫస్ట్ పేజీల్లో ప్రచురించని పత్రికలు..చూపించని టీవీల విషయంలో కఠినంగా ఉంటామని..వీరిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. అంతే కాదు..ఆయా పత్రికల సర్కులేషన్ తగ్గించేలా తమ క్యాడర్ కూడా రంగంలోకి దిగుతుందని..అప్పటికీ దారికి రాకపోతే ఆయా ఆఫీసుల ముందు టెంట్లు వేస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ పాల్గొన్నా కూడా కనీసం కొన్ని టీవీల్లో స్క్రోలింగ్ లు కూడా రావటంలేదన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో తాము పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని తెలిపారు. తమకు కవరేజ్ ఇఛ్చేవాళ్ళనే ముందు కూర్చోపెడతామని..వార్తలు రాయని వారి గురించి బహిరంగంగా పేర్లు ప్రకటించటంతోపాటు వారిని బహిష్కరించాల్సిందిగా పిలుపునిస్తామన్నారు. గత కొంత కాలంగా రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా పలు అంశాలపై మాట్లాడినా ప్రధాన మీడియాలో కనీసం వార్తకు కూడా నోచుకోలేదు. అందుకే తాము ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వాళ్లు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మీడియాను నియంత్రిస్తున్నారు. ప్రకటనల అంశం చూపించో..మరో అంశంతోనే దారికి తెచ్చుకుంటున్నారు. ఇఫ్పుడు ప్రతిపక్షం నేరుగా రంగంలోకి హెచ్చరికలు జారీ చేయటంతో తెలంగాణలో మీడియా రాజకీయం కొత్త మలుపులు తిరగటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it