Telugu Gateway
Politics

పేద రాష్ట్రం ఫుల్ జీతం...ధనిక రాష్ట్రం సగమే

పేద రాష్ట్రం ఫుల్ జీతం...ధనిక రాష్ట్రం సగమే
X

ఆదాయం విషయంలో తెలంగాణాతో పోలిస్తే ఏపీ పేద రాష్ట్రమే. కానీ ఏపీ సర్కారు మాత్రం మే నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు కూడా. కరోనా కారణంగా ఆదాయం పూర్తిగా పడి పోవటంతో తొలుత తెలంగాణ, ఏపీల్లో మార్చి నెలలో ఉద్యోగుల వేతనాల్లో సగానికి సగం కోత పెట్టారు. మార్చితోపాటు ఏప్రిల్ లో కూడా ఇదే నిర్ణయాన్ని కొనసాగించారు. అసలు దేశంలోనే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన తొలి రాష్ట్రం కూడా తెలంగాణనే కావటం విశేషం. తొలుత ఈ నిర్ణయాన్ని ప్రకటించింది ముఖ్యమంత్రి కెసీఆరే. ఆ తర్వాత ఏపీ కూడా ఇదే బాట పట్టింది. రెండు నెలల పాటు కోత విధించిన ఏపీ సర్కారు మే లో మాత్రం ఉద్యోగుల నుంచి పెద్దగా వినతులు లేకపోయినా తనంతట తానుగానే పూర్తి స్థాయి వేతనాలు ఇవ్వటానికి ఏపీ సర్కారు రెడీ అయిపోయింది. ఈ పరిణామం జరిగిన తర్వాత తెలంగాణలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కలసి మేలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనాలు అందజేయాలని కోరారు. కానీ ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం ఈ వినతులను పెద్దగా పట్టించుకున్నట్లు కన్పించటం లేదు.

బుధవారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మేలోనూ 50 శాతం జీతాలే అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఆదాయాలు సరిపడినంత లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అదే నిజం అయితే మరి ఏపీలో మాత్రం ఎలా చేయగలుగుతున్నారనే ప్రశ్న ఉదయిస్తుంది. తెలంగాణ ఉద్యోగులు మాత్రం సర్కారు తీరుపై గుర్రుగా ఉన్నారు. ఓ వైపు నిధులు లేవని అంటూనే కరోనా సంక్షోభ సమయంలోనూ వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తున్న సర్కారు పనిచేసిన ఉద్యోగులకు మాత్రం ఇలా నెలల తరబడి ఇవ్వాల్సిన వేతనాల్లో కోతలు పెట్టడం ఏ మాత్రం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it