Telugu Gateway
Andhra Pradesh

అత్యవసర నిధికి పవన్ కళ్యాణ్ డిమాండ్

అత్యవసర నిధికి పవన్ కళ్యాణ్ డిమాండ్
X

కరోనా సంక్షోభ సమయంలో పలు వర్గాలను ఆదుకునేందుకు తక్షణమే అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. పొరుగున ఉన్న కర్ణాటక 1600 కోట్ల రూపాయలతో ఈ తరహా నిధిని ఏర్పాటు చేసిందని..ఏపీ కూడా ఈ దిశగా ముందుకు సాగాలన్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటనలోని ముఖ్యాంశాలు..‘ లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయి అవస్థలు పడుతున్నారు. వారి కోసం ఆర్థికపరమైన ఉపశమన చర్యలు తక్షణమే చేపట్టవలసిన పరిస్థితులు ఉన్నాయి.

పనులకు ఆస్కారం లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు, రోజు కూలీలు, హమాలీలు, కుల వృత్తిదారులు చేసుకొంటున్న క్షురకులు, రజకులు, వడ్రంగి, చేనేత కార్మికులు, ఆటో, టాక్సీ డ్రైవర్లు, స్వయం ఉపాధి కింద బైక్ మెకానిక్, ఎలక్ట్రికల్ పనులు చేసుకొనేవారు, హాకర్లు, చిన్నపాటి టిఫిన్ బండ్లు నిర్వహించుకునే వారు... ఆర్థికంగా దెబ్బ తిన్నారు. దుర్భరమైన పరిస్థితికి లోనవుతున్నారు. వారందరికీ ఐదువేల రూపాయలకు తక్కువ కాకుండా ఆర్థిక సహాయం అందించవలసిన అవసరం ఉంది. విధంగా చిరు వ్యాపారాలు నిర్వహించుకునే వారికీ, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు నిర్వహిస్తున్న వారికీ విద్యుత్ బిల్లుల విషయంలో కొన్ని నెలలపాటు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. ఆస్తి, వృత్తి పన్నుల వసూలు మినహాయింపు ఇవ్వాలి’ అని పవన్ కళ్యాణ్ కోరారు.

Next Story
Share it