Telugu Gateway
Telangana

తెలంగాణలో మరో పది కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో మరో పది కరోనా పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో కరోనా పరీక్షలు సరిగా జరగటం లేదని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రానికి కూడా తెలిపామని వెల్లడించారు. తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఈటెల రాజేందర్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. కొత్తగా వచ్చిన పది కేసులతో కలుపుకుంటే తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1132కు పెరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 727 మంది కరోనా నుంచి కోలుకున్నారన్నారు. శుక్రవారం ఒక్కరోజే 34 మంది డిశ్చార్జ్‌ అయ్యారని.. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 376 మందికి చికిత్స తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయగలిగామని ఈటెల వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ప్రస్తుతం 9 జిల్లాలు గ్రీనో జోన్ లో ఉన్నాయి. మరో 14 జిల్లాలు గ్రీన్ జోన్ లోకి మార్చమని కేంద్రాన్ని అడిగామన్నారు. కేంద్రం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. దీంతోపాటు సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్ జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరాం. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. 75 ఏళ్ల వృద్ధుడు కూడా కరోనా నుంచి కోలుకున్నాడు. గాంధీ వైద్యులు గొప్పగా పనిచేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని మంత్రి ఈటెల తెలిపారు.

Next Story
Share it