టీడీపీ ఆఫీసుకు కోవిడ్ నోటీసులు

మహానాడు సమావేశం జరుగుతున్న ఏపీ టీడీపీ ఆఫీస్ కు సర్కారు కోవిడ్ నోటీసులు ఇచ్చింది. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎక్కడా కూడా రాజకీయ సమావేశాలు, ఇతర సభలు జరపటానికి అనుమతి లేదు. అయితే టీడీపీ ఆఫీస్ నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు మరికొంత మంది నేతలు జూమ్ యాప్ ద్వారా మహానాడు నిర్వహించారు. పార్టీ కార్యాలయం పరిధిలోని మంగళగిరి ఎమ్మార్వో టీడీపీ కార్యాలయానికి కోవిడ్ నోటీసులు జారీచేశారు.
మహానాడు సందర్భంగా కరోనా వైరస్ నివారణ చర్యలు తీసుకోవాలని బుధవారం నోటీస్ ఇచ్చారు. ఈ మేరకు కార్యాలయ కార్యదర్శి రమణికి ఆత్మకూరు వీఆర్వో నోటీసులు అందజేశారు. ఈ నోటిసులో ‘‘ రాజకీయ ఫంక్షన్లు, ఇతర సమావేశాలపై ప్రస్తుతం నిషేదం ఉంది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 ద్వారా చర్యలకు అర్హుల’’ ని ఎమ్మార్వో పేర్కొన్నారు.