Telugu Gateway
Politics

ఆ సీఎం పదవికి ఢోకా లేదు

ఆ సీఎం పదవికి ఢోకా లేదు
X

నిన్నటి వరకు టెన్షన్ టెన్షన్. ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉంటారా?. రాజీనామా చేయాల్సి వస్తుందా అన్న అంశంపై చర్చోపచర్చలు సాగాయి. కానీ ఒక్క ఫోన్ కాల్ తో పరిస్థితి మారిపోయింది. కరోనా సంక్షోభ సమయంలోనూ మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చింది. ఏ సభలో సభ్యుడు కాని ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆయన ఆరు నెలల్లో ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి. కానీ కరోనా కారణంగా మహారాష్ట్రలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అన్ని రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. రాజ్యసభ ఎన్నికలు కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర కేబినెట్ రెండుసార్లు ఉద్ధవ్ ఠాక్రేను నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిలో నియమించాలని గవర్నర్ కు సిఫారసు చేసినా..ఆయన పట్టించుకోలేదు. దీంతో ఉద్థవ్ ఠాక్రే పదవి అంశంలో టెన్షన్ నెలకొంది. దేశంలోనే మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు ఉన్నాయి. ఈ సంక్షోభ సమయంలో రాజకీయ అనిశ్చితి ఏ మాత్రం సరికాదని..ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి గురువారం సాయంత్రం సీఎం ఠాక్రే ఫోన్ చేసి మాట్లాడారు.

అంతే వెంటనే ఆయన కూడా గవర్నర్ తో మాట్లాడి మార్గం సుగమం చేయాల్సిందిగా కోరారు. ఆ వెంటనే ఎన్నికల కమిషన్ కు లేఖ వెళ్ళటం..షెడ్యూల్ రావటం కూడా చకచకా జరిగిపోయాయి. దీంతో మే 21న మ‌హారాష్ట్ర‌లో ఖాళీగా ఉన్న 9 శాస‌న‌మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా బారిన పడకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది. అంద‌రూ ముఖాల‌కు మాస్కులు ధ‌రించి, సామాజిక దూరం పాటిస్తూ పోలింగ్‌లో పాల్గొనాల‌ని ఈసీ పేర్కొంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఈసీకి లేఖ రాసిన నేపథ్యంలో చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునీల్ అరోరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు పదవి ముప్పు తప్పింది.

Next Story
Share it