Telugu Gateway
Cinema

‘మా’ను డమ్మీ చేసి.. వాళ్ళే ‘షో’ నడిపిస్తున్నారా?!

‘మా’ను డమ్మీ చేసి.. వాళ్ళే ‘షో’ నడిపిస్తున్నారా?!
X

టాలీవుడ్ నటీనటులకు సంబంధించి మూవీ అర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) అత్యంత కీలకమైన సంఘం. కరోనా కారణంగా వచ్చిన సమస్య ఏంటి అంటే ఎక్కడ షూటింగ్ లు అక్కడే ఆగిపోవటం..థియేటర్లు బంద్ అవటం. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు రంగంలోకి దిగారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీలేదు. అందుకు తొలుత మెగస్టార్ చిరంజీవి నివాసంలో కీలక భేటీ జరిగింది. ఆ తర్వాత అందులో కొంత మంది ముఖ్యమంత్రి కెసీఆర్ ను కూడా కలిశారు. సీఎం కెసీఆర్ కూడా పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందించారు. అంత వరకూ ఎక్కడా వివాదమే లేదు. కానీ సడన్ గా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలపై సమావేశాలు..సీఎంలతో భేటీ విషయాలు తనతో ఎవరూ మాట్లాడలేదని..తాను పత్రికల్లోనే చూశానని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా మరో సందర్భంలో మంత్రి తలసానితో కలసి భూములు పంచుకుంటున్నారా అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడ నుంచే మొదలైంది అసలు దుమారం. సీ. కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజలు చెబుతున్నట్లు బాలకృష్ణ యాక్టివ్ గా లేడు..అందుకే పిలవలేదు అనుకుందాం.

మరి ‘మా’ అధ్యక్షుడు నరేష్ ను కూడా చిరంజీవి నివాసంలో సమావేశానికి కానీ...సీఎం కెసీఆర్ దగ్గర జరిగిన సమావేశానికి కానీ పిలవలేదు. అత్యంత కీలకమైన , ఎన్నికైన ‘మా’ అధ్యక్షుడు వంటి వారికి కూడా పరిశ్రమ మొత్తానికి చెందిన అంశంపై కీలక సమాచారం ఇవ్వరా?. ‘మా’సమావేశంలో జరిగిన ఓ రచ్చకు సంబంధించి కొన్ని రోజులు నరేష్ ను దూరంగా పెట్టారని..ప్రస్తుతం బెనర్జీ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే నరేష్ వెళ్లిన సెలవు కాలం ముగిసిందని..కానీ బెనర్జీ అనే సీనియర్ నటుడు ఉన్నా కూడా అసలు సీఎంతో మాట్లాడిన సమయంలో కానివ్వండి..మిగిలిన సమయాల్లో ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవని..షో అంతా చిరంజీవి, నాగార్జునలే నడిపించారని చెబుతున్నారు.

తాజాగా సీ కళ్యాణ్ మాట్లాడుతూ స్వయంగా సీఎం కెసీఆరే చిరంజీవి, నాగార్జునలను ఈ వ్యవహారం చూసుకోవాల్సిందిగా చెప్పారని ప్రకటించారు. కెసీఆర్ కు ఈ సంఘాల విషయంలో అంతగా వివరాలు తెలిసుండకపోవచ్చు కానీ ...చిరంజీవి, నాగార్జునలు అయినా ఎన్నికైన ‘మా’ సంఘం కీలక సభ్యులను వదిలేసి కొంత మంది మాత్రమే పెత్తనం చేస్తున్నారని విమర్శలు పరిశ్రమ వర్గాల నుంచే వస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి సమావేశాలకు రాని ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు కూడా రకరకాల కారణాలతో ఇందులో పాల్గొన్నారని చెబుతున్నారు.

నిజంగానే భూ కోణం ఉందా

హీరో నందమూరి బాలకృష్ణ ఆరోపించినట్లు ఇందులో నిజంగానే ఏమైనా భూమి కోణం ఉందా?. అంటే పరిశ్రమ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో..ఔటర్ రింగు రోడ్డు వెలుపల పరిశ్రమకు ప్రభుత్వం కొంత మంది భూమి ఇచ్చే ఆలోచనలో ఉందని..ఆ చుట్టుపక్కలే పరిశ్రమ ప్రముఖులు కూడా భూమి దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నారని...అందుకే ఎప్పుడూలేనంత చొరవగా రంగంలోకి దిగి హంగామా చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. చాలా సార్లు దూకుడుగా మాట్లాడి, వివాదస్పద వ్యాఖ్యలు చేసి బాలకృష్ణ విమర్శలు పాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ అసలు ఎలాంటి సమాచారం లేకుండా బాలకృష్ణ ‘భూముల’ అంశాన్ని ప్రస్తావించటం జరగదని చెబుతున్నారు. కొంత మంది ప్రముఖులు అందరూ తమ వెనకే ఉన్నారని చెప్పుకునేందుకు కీలక వ్యక్తులు ఈ హంగామా చేస్తున్నారని చెబుతున్నారు. చూడాలి ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో.

Next Story
Share it