Telugu Gateway
Politics

వైసీపీ నేతలకు చట్టం వర్తించదా?

వైసీపీ నేతలకు చట్టం వర్తించదా?
X

‘సాక్ష్యాత్తూ మంత్రులు, వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో మాట్లాడితే చట్టం పనిచేయదు. కానీ ఓ వైద్యుడిపై మాత్రం బలంగా పనిచేస్తుంది. ప్రభుత్వ ఆస్తుల వేలం, విద్యుత్ బిల్లుల విషయంలో క్షేత్రస్థాయి నుంచి పోరాడాలి. ఎన్నికలకు ముందు మద్యనిషేధంపై ఏమి చెప్పారు. ఇప్పుడు ఏమి చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఇళ్ళ స్థలాల విషయంలో ప్రజలను మభ్యపెట్టకుండా పేదలందరికీ ఇవ్వాలి’ అని జనసేన అధినేత వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం నాడు విశాఖపట్నం జిల్లా జనసేన నాయకులతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. డాక్టర్ సుధాకర్ ను సర్కారు తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. “డాక్టర్ సుధాకర్ అసభ్య పదజాలం వాడారని అరెస్ట్ చేశారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలోనూ, బహిరంగ వేదికలపై అసభ్య పదజాలం వాడినప్పుడు, ఆ పార్టీ వాళ్ళు టీవీ చర్చల్లో నోరు పారేసుకున్నప్పుడు ఈ చట్టం ఎందుకు బలంగా పని చేయలేదు. కాకినాడలో ఓ ప్రజా ప్రతినిధి ఇలాగే మాట్లాడితే నిరసన తెలిపిన జనసేన నాయకులపైనే కేసులుపెట్టారు.

ఆ రోజు నేను ఎదురు తిరగలేక కాదు హుందాగా ఉండాలనే సంయమనం పాటించాను. చట్టం బలవంతులపై బలహీనంగా, బలహీనులపై బలంగా ప్రయోగించడం సరికాదు. రాష్ట్రంలోని విలువైన ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు సర్కారు సిద్ధమైంది. ఆ భూముల వాస్తవ విలువలు ఏమిటి, వేలం వెనక అసలు వ్యవహారం ఏమిటో ప్రజలకు తెలియాలి. కరోనా మూలంగా ఆర్థికంగా ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చాయని అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మన పార్టీ నాయకులు ప్రజల సమస్యలపై బలంగా స్పందించాలి. ప్రభుత్వ భూముల వేలం, అధిక విద్యుత్ బిల్లులు, మద్యం అమ్మకాలుపై నాయకులందరూ చర్చించుకొని సమష్టిగా క్షేత్ర స్థాయి నుంచి పోరాడాలి. విశాఖపట్నం రాష్ట్రానికి గుండె లాంటిది. అంతేకాదు మన దేశ రక్షణకు సంబంధించి ఈ నగరం కీలకమైనది. అలాంటి నగరంలో చోటుచేసుకున్న ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన ఆందోళనకరమైనది. ఆ పరిశ్రమ నుంచి విడుదలైన విష వాయువు స్టైరిన్ ప్రభావం ఇంకా ఎంత కాలం, ఏ స్థాయిలో ఉంటుందో అన్న భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కరోనా ప్రభావం ఉండగానే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఆ దుష్ప్రభావం ఇప్పటికీ ప్రజలను భయపెడుతూనే ఉంది. ఆ ప్రభావం 3కి.మీ. వరకూ ఉంటుందని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిధిని 600 మీటర్లకే కుదించారు. ఈ అంశంపై నాయకులు దృష్టిపెట్టాలి. ప్రభుత్వం ఉన్న ఆస్తులను వేలం వేసి అమ్మేస్తోంది. విశాఖపట్నంలో సైతం విలువైన భూములను అమ్మకానికి పెట్టేసింది. దీనిపై ఇప్పటికే మన పార్టీ నేతలు నిరసన తెలుపుతున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో సైతం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక జ్వరాల బారినపడుతున్నారు. తాగు నీటి సమస్య తీవ్రంగా ఉంది” అన్నారు.

Next Story
Share it