Telugu Gateway
Politics

కెసీఆర్ పై కిషన్ రెడ్డి విమర్శలు

కెసీఆర్ పై కిషన్ రెడ్డి విమర్శలు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయటం సరికాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకపోతే రైతుబంధు పథకం వర్తించదని చెప్పే కెసీఆర్ కేంద్రం తెచ్చే సంస్కరణలను మాత్రం తప్పుపడుతున్నారని విమర్శించారు. తెలంగాణ సంస్కరణలు చేస్తే మాత్రం తప్పులేదు కానీ..కేంద్రం తీసుకొస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కెసీఆర్ సోమవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడిన భాష బాగోలేదని కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కెసీఆర్ రెండు నాల్కల ధోరణి వీడాలన్నారు.

సంస్కరణల్లో భాగంగా ఒకే దేశం-ఒకే గ్రిడ్ విధానం అమలు కావాల్సిందేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సీఎం కెసీఆర్ విమర్శలపై స్పందించారు. దేశ హితం కోసం తెచ్చిన ఆర్ధిక ప్యాకేజీ అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరమన్నారు. ప్రధాని మోడీ హయాంలో ఒక్క రూపాయి అయినా దుర్వినియోగం అయిందా అని ప్రశ్నించారు. నైపుణ్య శిక్షణ, పరిశ్రమల స్థాపనకు సంస్కరణలు తీసుకురాకపోతే దేశం మరో 70 సంవత్సరాలు అయినా ఇలాగే ఉంటుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం తెచ్చిన ప్యాకేజీతో తెలంగాణకు నష్టం ఎలా జరుగుతుందో కెసీఆర్ చెప్పాలన్నారు. కేంద్ర ప్యాకేజ్ బోగస్ అనటాన్ని కిషన్ రెడ్డి తప్పుపట్టారు.

Next Story
Share it