Telugu Gateway
Andhra Pradesh

బిజెపి తో కలసి జనసేన నిరసనలు

బిజెపి తో కలసి జనసేన  నిరసనలు
X

టీటీడీ ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా మంగళవారం నాడు బిజెపితో కలసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో జనసేన కూడా పాల్గొననుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారన్నారు. ఈ విషయాలను సంయుక్త పార్లమెంటరీ కమిటీల టెలికాన్ఫరెన్స్ లో మనోహర్ వెల్లడించారు. బిజెపితో కలసి చేపట్టే కార్యక్రమాలపై త్వరలోనే రోడ్డు మ్యాప్ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. స్థానిక బిజెపి నాయకులతో సమన్వయం చేసుకుంటూ జనసేన శ్రేణులు నిరసనల్లో పాల్గొనాలని కోరారు. టీటీడీ భూములను వేలం ద్వారా విక్రయించే హక్కు ప్రభుత్వానికి లేదని, టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో బిజెపి, జనసేనలు ఈ నిరసన కార్యక్రమం తలపెట్టాయి.

‘కొత్త ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది వరకూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నాం. అయితే ప్రభుత్వం పాలనలోకి వచ్చిన కొద్ది కాలం నుంచే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా, ప్రణాళిక లేకుండా పాలన మొదలుపెట్టింది. సమస్యలు ఎదురైన ప్రతి సందర్భంలోనూ జనసేన సరైన రీతిలో స్పందించింది. రాజకీయ పోరాటంతో ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్దాం. నిరసనల్లో కూడా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలి. ’ అని నాదెండ్ల మనోహర్ జనసేన నేతలకు సూచించారు.

Next Story
Share it