Telugu Gateway
Andhra Pradesh

కరోనాను కంట్రోల్ చేయటంలో జగన్ ఫెయిల్

కరోనాను కంట్రోల్ చేయటంలో జగన్ ఫెయిల్
X

‘కేరళలో కరోనాను విజయవంతంగా కట్టడి చేశారు. కానీ వీళ్ళు ఏమి చేశారు. అదే తెలుగుదేశం పార్టీ ఉండి ఉంటే కరోనాను తొలి రోజు నుంచి కట్టడి చేసేవాళ్లం. మేం మొదటి రోజు నుంచి చెబుతుంటే మమ్మల్ని ఎగతాళి చేశారు తప్ప..కట్టడికి చర్యలు తీసుకోలేకపోయారు. దీన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. అవగాహన లేకుండా మాట్లాడారు. బ్లీచింగ్ పౌడర్ వేస్తే పోతుంది..పారాసిటమల్ తో తగ్గుతోంది అని మాట్లాడారు. ’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. బుధవారం నాడు ప్రారంభం అయిన మహానాడులో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా జూమ్ యాప్ ద్వారా తొలిసారి ఈ మహానాడును నిర్వహించారు. గత ఏడాది కాలంగా ఎదుర్కొన్న కష్టాలు తాను గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కష్టకాలంలోనూ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తున్నారని..వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బెదిరించి, బలవంతం చేసి నాయకులను ప్రలోభపర్చుకునే పనిలో ఉందని విమర్శించారు. జగన్‌ పాలనంతా భూకబ్జాలు, అవినీతిమయమని విమర్శించారు. ‘విశాఖలో ఆరోగ్యసేతు యాప్ తయారు చేసే వ్యక్తికి చెందిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ స్ట్రేషన్ చేయాలంటూ పులివెందుల నుంచి వచ్చిన కొంతమంది దౌర్జన్యం చేశారన్నారు. అలాగే కాకినాడ మడ అడవులు, ఇంకొకవైపు ఆవ, రాజమండ్రి భూములు, గుడివాడలో ప్రైవేటు భూములు.. 63 మంది కొనుక్కుంటే అవి ఇచ్చేయాలని ఓ మంత్రి బలవంతం చేయడమంటే.. వాళ్లను ఏమనాలో అర్థం కావడం లేదని అన్నారు. టీటీడీ భూములు అమ్మకానికి పెట్టడం.. ఈ సమయంలో భూములు అమ్మడమేంటని’ చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తప్పు చేయడం, కప్పి పుచ్చుకోడానికి ఎదురుదాడి చేస్తుందని విమర్శించారు. బిల్డ్ ఏపీ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ను అమ్మేయడం... ఈ అరాచకమేంటని ప్రశ్నించారు.

విధ్వంసం కోసమే ఒక్క అవకాశం అడిగారా? అని ప్రశ్నించారు. ప్రజావేదిక నుంచి విజయనగరంలో మూడు లాంతర్ల వరకు కూల్చివేతలు కొనసాగుతున్నాయన్నారు. విపక్ష కార్యకర్తలపై దాడులు.. వేలాది మందిపై కేసులు నమోదు చేశారన్నారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం పూర్తి చేస్తే ఎన్నో ఉద్యోగాలు వచ్చేవన్నారు. తన వారికి కాంట్రాక్ట్‌ ఇచ్చేందుకు 70శాతం పూర్తైన పోలవరాన్ని నిలిపివేశారన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు ఇచ్చి.. కృష్ణా నీటిని రాయలసీమకు ఇచ్చేందుకు శ్రీకారం చుడితే అవన్నీ నిలిపివేశారన్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్న ప్రాజెక్ట్‌ లన్నీ టీడీపీ హయాంలో నిర్మించినవేనన్నారు. గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధానం ప్రాజెక్ట్‌ ను పక్కన పెట్టేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story
Share it