Telugu Gateway
Cinema

టాలీవుడ్ లో కరోనా వేళ ఈ కుట్రలు ఏంటి?

టాలీవుడ్ లో కరోనా వేళ  ఈ కుట్రలు ఏంటి?
X

విజయ్ పై వ్యతిరేక ప్రచారం వెనక రెండు నిర్మాణ సంస్థలు?!

రెండు నిర్మాణ సంస్థలు. ఇద్దరు ప్రముఖులు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వెనక బురద జల్లే కార్యక్రమంలో వీరిదే కీలక పాత్రా?. అంటే ఔననే చెబుతున్నాయి టాలీవుడ్ వర్గాలు. విజయ్ దేవరకొండ సడన్ గా ఓ వీడియో విడుదల చేసి వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని వెబ్ సైట్లు ఇష్టానుసారం వార్తలు రాస్తున్నాయని ఘాటుగానే స్పందించారు. తాను చేసే సాయం గురించి అసలు వాళ్లకు చెప్పాల్సిన పనేంటి అని ప్రశ్నించారు. తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ ముందుకెళతాని ప్రకటించారు. విజయ్ ప్రకటన పరిశ్రమ వర్గాల్లో కలకలం రేపింది. ఇది ఏదో వెబ్ సైట్లు కావాలని చేసిన వ్యవహారం కాదని..దీని వెనక రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు, మరి కొంత మంది వ్యక్తులు ఉన్నారని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. కరోనా కారణంగా అందరూ ఖాళీగా ఉన్న సమయంలో ఈ కుట్రలు ఏంటో అర్ధం కావటంలేదని పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. అయితే ఆ నిర్మాణ సంస్థల కుట్ర కోణాన్ని గుర్తించిన ప్రముఖ హీరోలు విజయ్ దేవరకొండకు మద్దతు గా నిలుస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

మెగా స్టార్ చిరంజీవితోపాటు పలువురు విజయ్ కు సంఘీభావం ప్రకటించినా కూడా ఆ నిర్మాణ సంస్థల తరపున కానీ..ఆ గ్రూప్ నుంచి ఒక్కరూ కూడా స్పందించకపోవటం పరిశ్రమ వర్గాల్లో మరింత అనుమానాలు తలెత్తుతున్నాయి. టాలీవుడ్ లో కుట్రలు చాలా సహజాతి సహజమే అని..ఎవరైనా వేగంగా ఎదుగుతుంటే వారిని వెనక్కి లాగే ప్రయత్నాలు కూడా అంతే వేగంగా జరుగుతాయని ఓ పరిశ్రమ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. ఇందులో ప్రాంతం, కులం ఇలా ఎన్నో అంశాలు కీలకంగా ఉంటాయి. విజయ్ దేవరకొండను బద్నాం చేయటం వెనక రకరకాల కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.

Next Story
Share it