Telugu Gateway
Telangana

మీడియాపై కెసీఆర్ ‘ఈ ఛాన్స్’ తీసుకుంటారా?

మీడియాపై కెసీఆర్ ‘ఈ ఛాన్స్’ తీసుకుంటారా?
X

తెలంగాణ సీఎం కెసీఆర్ గత కొంత కాలంగా కొన్ని మీడియా సంస్థలపై గుర్రుగా ఉన్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే కరోనా సమయంలో అన్ని రంగాల తరహాలో మీడియా కూడా విలవిలలాడుతోంది. ప్రకటనలు లేక ఏకంగా పేజీలు తగ్గించి..ఉద్యోగులను తొలగించి, ఉద్యోగుల జీతాల్లో కూడా కోతలు వేశారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కెసీఆర్ ను మీడియా ప్రతినిధులు న్యాయవాదుల తరహాలో ‘జర్నలిస్టుల’ను కూడా ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందిచింన సీఎం.. మీకెందుకు..మీకు యాజమాన్యాలు జీతాలు ఇస్తాయి కదా? అని ప్రశ్నించారు. జీతాల్లో కోతలు పెట్టారని..సరిగా ఇవ్వటంలేదని కొంత మంది ఫిర్యాదు చేశారు. అవునా..నిజమా అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన కెసీఆర్ ఇలా బహిరంగంగా మాట్లాడటం కాకుండా విషయం తెలిసిన వాళ్లు ఇద్దరు బుధవారం రోజు దరఖాస్తు తీసుకుని రండి..నేను చూస్తా అని బహిరంగంగానే ప్రకటించారు.

జీతాలు ఇవ్వనివాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మరి ఇప్పుడు కెసీఆర్ జీతాల కోతను ఓ ఛాన్స్ గా తీసుకుంటారా? అన్న చర్చ మొదలైంది. ఈనాడు వంటి పత్రికలో కూడా తొలిసారి జీతాలను పదవ తేదీ వరకూ వాయిదా వేశారు. కోతల కోసమే ఈ పనిచేశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే కెసీఆర్ ఈ అంశంపై కార్మిక శాఖ అధికారులతో చర్చకు రెడీ అవుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఓ వైపు కరోనా సమయంలో మీడియా సిబ్బంది రిస్క్ తీసుకుని మరీ విధులు నిర్వహిస్తున్నా సరిగ్గా వేతనాలు ఇవ్వకపోగా..అందులో కోతలు కోయటం సరికాదని కెసీఆర్ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడే ఓ చిక్కు ఉంది. కెసీఆర్ ఫ్యామిలీ ఆధీనంలో ఉన్న నమస్తే తెలంగాణ పత్రికలో కూడా జీతాలు కోత కోయకపోయినా...కొంత మొత్తాన్ని వాయిదా వేసి..తర్వాత సర్దుబాటు చేస్తామని ప్రకటించారని సిబ్బందే చెబుతున్నారు.

ఆంధ్రజ్యోతితో పాటు పలు ఇతర పత్రికల్లోనూ కోత అమలు అయింది. అసలు కరోనా అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే దేశంలోనే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం పైగా కోత వేసిన తొలి ముఖ్యమంత్రి కెసీఆరే. గత రెండు నెలలుగా ఇదే అమలు చేస్తున్నారు కూడా. ఎన్నో వనరులు ఉండి..నిధులు తెచ్చుకునే వెసులుబాట్లు ఉన్న ప్రభుత్వాలే జీతాలు ఇవ్వలేకపోయినప్పుడు కెసీఆర్ ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోగలరా?. ముఖ్యమంత్రి మీడియా విషయంలో తనకున్న కోపాన్ని ఈ కారణంగా తీర్చుకోగలరా?. ఏమి జరుగుతుందో వేచిచూడాల్సిందే. నిజంగానే కెసీఆర్ మీడియాలో జీతాల కోతను నివారించగలుగుతారా? లేక అలా వదిలేసి ఊరుకుంటారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it