Telugu Gateway
Politics

బండి సంజయ్ దూకుడికి..పవన్ కు సెట్ అవుతుందా?!

బండి సంజయ్ దూకుడికి..పవన్ కు సెట్ అవుతుందా?!
X

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ సోమవారం నాడు హైదరాబాద్ లో రెండు గంటల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. నగరంలోని పవన్ కళ్యాణ్ ఆఫీసులో ఈ భేటీ జరిగింది. కొద్ది కాలం క్రితం బిజెపితో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా రెండు పార్టీలు కలసి పోరాటం చేస్తున్నాయి. సహజంగానే ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని..మరో రాష్ట్రంలో దూరంగా ఉండే ఛాన్స్ ఉండదు. సో..తెలంగాణలోనూ బిజెపి, జనసేన కలసి సాగటానికే ఎక్కువ ఛాన్స్ లు ఉన్నాయి. అలా కాకుండా ఏపీలోనే పొత్తు ఉంటుంది..తెలంగాణలో ఉండదు అని చెప్పే ఛాన్స్ ఉండదు. గత కొంత కాలంగా బండి సంజయ్ తెలంగాణ సర్కారుపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు.

కరోనా టెస్ట్ ల అంశంతోపాటు పలు అంశాలపై బండి సంజయ్ తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే జనసేన విషయానికి వచ్చేసరికి తెలంగాణ అంశాలపై పవన్ కళ్యాణ్ మౌనం దాల్చుతున్నారు. ఎంత సీరియస్ అంశం అయినా తెలంగాణలోని అంశాలపై స్పందన కరువే. అంతే కాదు..ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్, కెటీఆర్ లు అన్నదమ్ములుగా మాట్లాడుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ బిజెపితో కలసి ముందుకు సాగుతూ తెలంగాణ సర్కారుపై బిజెపి దూకుడుకు సమానంగా విమర్శలు చేయగలుగుతారా వేచిచూడాల్సిందే. సోమవారం నాడు జరిగిన సంజయ్,, పవన్ భేటీలో ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపైనే చర్చలు సాగినట్లు సమాచారం.వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న బిజెపి..పవన్ కళ్యాణ్ తో కలసి సాగటానికే ఆసక్తి చూపుతోంది. ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే.

Next Story
Share it