Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో కరోనా కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు

ఏపీలో కరోనా కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న దానికంటే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తనకు వైద్య నిపుణుల నుంచి సమాచారం వస్తోందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 96 కేసుల వరకూ ఉన్నాయని అంటున్నారు, కానీ అంతకంటే ఎక్కువగానే ఉన్నాయనే ఆందోళన ప్రజానీకంలో ఉందని చెప్పారు. పొరుగున ఉన్న తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి కాబట్టి ఏపీలోనూ మరింత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చెన్నైతో నెల్లూరు, చిత్తూరు జిల్లావారికి వ్యాపారపరమైన సంబంధాలు, రాకపోకలు ఉంటాయి.. అక్కడి కోయంబేడు మార్కెట్ కి వ్యవసాయ ఉత్పత్తులు వెళ్తుంటాయి కాబట్టి ఆ జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లు శనివారం నాడు నెల్లూరు జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “కరోనా ఎక్కువ కాలం ఉండే ఆరోగ్య సంబంధిత సమస్య అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఈ సమస్య అదుపులోకి వచ్చేందుకు రెండున్నర సంవత్సరాలు పట్టవచ్చని నిపుణుల వ్యాసాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ దేశానికీ దేశానికీ రూపం మార్చుకొంటోంది... కాబట్టి ఒకే వ్యాక్సిన్ తో కాకపోవచ్చు... వైరస్ రూపానికి తగ్గ విధంగా వ్యాక్సిన్లు తీసుకురావాల్సి ఉంటుందని ఫార్మా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం లాంటివి చేయాలి. ఇవి మనం పాటించే నిబంధనల్లో భాగంగా మారవచ్చు. కరోనా ప్రభావం, లాక్ డౌన్ వల్ల పలు రంగాలు దెబ్బ తిని, నష్టపోయాయి. వివిధ వృత్తుల్లో ఉన్నవారు ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారు. వాటిపట్ల ప్రభుత్వం సానుభూతితో స్పందించి సహకారం అందించాలి.

నెల్లూరు జిల్లాలో జనసేన నాయకులు, శ్రేణులు ఆపదలో ఉన్నవారికి చేస్తున్న సేవలు అభినందనీయం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలవాలి అన్నది మన పార్టీ విధానం.’ అన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదైంది నెల్లూరు జిల్లాలోనే. ఇక్కడ కేసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు జిల్లా పొరుగున ఉన్న తమిళనాడులో వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. అధికార పక్షం ఈ విపత్కర సమయంలో వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధుల వ్యవహారం, ప్రజల ఇబ్బందులు, స్థానిక సమస్యలపై మన పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు స్పందించండి. ప్రజలకు మేలు జరిగే విధంగా పని చేయాలి” అని చెప్పారు. నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు ఉన్న తీరు, నియంత్రణలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, రైతాంగం బాధలపై జిల్లా నాయకులు నేతలకు వివరించారు.

Next Story
Share it