Telugu Gateway
Politics

అమెరికాలోకి విదేశీయులు నో

అమెరికాలోకి విదేశీయులు నో
X

ట్రంప్ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది భారతీయ ఐటి నిపుణులతోపాటు పలు వర్గాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. పలు ఇతర దేశాల నిపుణులు కూడా ఇది శరాఘాతం కిందే లెక్క. కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న అమెరికా మరిన్ని రక్షణాత్మక చర్యలకు దిగుతోంది. తమ దేశంలోని పౌరులకే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఉండేలా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఎన్నికలు కూడా ఉండటం ట్రంప్ నిర్ణయానికి కారణం అయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలోకి వలసలు (ఇమ్మిగ్రేషన్) తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. కరోనా అనే అదృశ్యశక్తితో ప్రస్తుతం అమెరికా పోరాడుతోందని..అందుకే దేశంలోని ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీని కోసం తాత్కాలికంగా వలసలను నిషేధించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే విదేశీయులు ఎవరూ అమెరికాలోకి అడుగుపెట్టడానికి వీలుండదు. అమెరికా ఆర్ధిక వ్యవస్థపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. చైనా విషయంలో కూడా ట్రంప్ గత కొన్ని రోజులుగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. అమెరికాకు నిపుణుల బృందాన్ని పంపిస్తామని ప్రకటిస్తే..ఈ ప్రకటనపై చైనా మండిపడింది. తాము బాధితులమే తప్ప..దోషులం కాదని ఘాటు సమాధానం ఇఛ్చింది. మరి ఈ పరిణామాలపై ట్రంప్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 7.75 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దాదాపు 42 వేలకు పైగా మృతిచెందారు.

Next Story
Share it