Telugu Gateway
Politics

లాక్ డౌన్ పై తుది నిర్ణయానికి ఈ వారమే కీలకం..!

లాక్ డౌన్ పై తుది నిర్ణయానికి ఈ వారమే కీలకం..!
X

కొత్త కేసుల ఆధారంగానే కేంద్రం ముందడుగు!

దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. ఎవరూ ఇళ్ళు దాటి బయటకు రావొద్దు అని చెప్పటం. అందునా ఇరవై ఒక్క రోజుల పాటు. అక్కడక్కడ కొన్ని ఉల్లంఘనలు ఉన్నా దేశ ప్రజలను బయటకు రాకుండా ఇళ్ళలోనే ఉంచటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కరోనాకు సంబంధించి భారత్ ఇప్పుడు అత్యంత కీలక దశలో ఉంది. ఈ వారమే అత్యంత కీలకం కాబోతోంది. వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 13. అంటే ఇప్పటికే ప్రకటించిన లాక్ డౌన్ ముగిసేందుకు ఒక్క రోజు ముందు అన్న మాట. అప్పటికే దేశంలో కొత్తగా వచ్చే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గటంతోపాటు..పరీక్షలు నిర్వహించాల్సిన వారు కూడా ఇంచుమించు పూర్తి అయి ఉండాలి. అలా కాకుండా ఏప్రిల్ 13 నాటికి కూడా ఇప్పుడు వస్తున్న తరహాలోనే కొత్త కేసులు కూడా వస్తూ ఉంటే లాక్ డౌన్ ఎత్తేయటం అనుమానమే అని కొంత మంది అధికారులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఢిల్లీలో జరిగిన మర్కజ్ సమావేశమే దేశంలో కరోనా కేసుల వ్యవహారాన్ని సంక్లిష్టం చేసిందనే చెప్పాలి. లేకపోతే భారత్ లో ఇంత తీవ్రత ఉండేది కాదని సాక్ష్యాత్తూ కేంద్రంతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి.

ఇప్పుడు దేశంలోని ప్రజలు అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది ఏప్రిల్ 14న అయినా లాక్ డౌన్ ఎత్తేస్తారా...లేదా? అన్న అంశంపైనే. అయితే ఇది ఈ వారంలో కొత్తగా నమోదు అయ్యే కేసులు..క్వారంటైన్ లో ఉన్న వారి సంఖ్యలో తగ్గుదల వంటి అంశాలే తేల్చనున్నాయని వైద్య శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 4067కు చేరగా..మృతుల సంఖ్య 109కి పెరిగింది. ఈ వారంలో కేసుల సంఖ్య నియంత్రణలోకి వచ్చినా కూడా ఒకేసారి ఆంక్షలు పూర్తిగా ఎత్తేయపోవచ్చని..కరోనా కేసులు ఏ మాత్రం లేని జిల్లాల్లో ఆంక్షలు పూర్తిగా తొలగించి..కేసులు ఎక్కువగా ఉన్న చోట మాత్రం ఆంక్షలు కొనసాగిస్తారనే చెబుతున్నారు. కరోనా ముప్పు ఇప్పటికిప్పుడు తొలగిపోయే ఛాన్స్ లేనందున ఒకేసారి ఆంక్షలు పూర్తిగా తొలగించటం సాధ్యంకాకపోవచ్చని..దీనికి కొంత సమయం పడుతుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఒకేసారి ఆంక్షలు తొలగించినా లాక్ డౌన్ వల్ల వచ్చిన ప్రయోజనం కాస్తా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని అభిప్రాయపడ్డారు.

Next Story
Share it