Telugu Gateway
Telangana

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు..మొత్తం453

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు..మొత్తం453
X

రాబోయే రోజుల్లో కరోనా పరీక్షలు చేయాల్సి వారి సంఖ్య తగ్గటంతో పాటు..కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆయన బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకూ కొత్తగా 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్ల తెలిపారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 453కి చేరింది. ఇందులో ఇప్పటికే 45 మంది డిశ్చార్జి కాగా..11 మంది మరణించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 397 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. గత నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున పరీక్షలు పూర్తి చేశామని తెలిపారు. ప్ర్రస్తుతం తమ వద్ద 535 శాంపిల్స్ మాత్రమే తమ దగ్గర ఉన్నాయని..అవి కూడా గురువారం నాటికి పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో 80 వేల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని, కొత్తగా మరో ఐదు లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్ ఇఛ్చామని వెల్లడించారు. వీటితోపాటు ఐదు లక్షల ఎన్-95 మాస్కులు, రెండు కోట్ల డాక్టర్ మాస్క్ లు, గాగుల్స్ ఐదు లక్షలు, 3.5 లక్షల టెస్టింగ్ కిట్లు ఆర్డర్ చేశామని మంత్రి తెలిపారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులన్నింటిని గాంధీలోనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గచ్చిబౌలిలో పదిహేను రోజుల్లో 1500 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశామన్నారు. ఢిల్లీ మర్కజ్ నుంచి రాష్ట్రానికి 1100 మందికిపైగా వచ్చారని..అలా వచ్చిన వారు..వారి కాంటాక్ట్ అయిన 3158 మందిని 167 క్వారంటైన్ సెంటర్లలో ఉంచామన్నారు. వారిని పరీక్షించి ఇంటికి పంపిస్తున్నట్లు ఈటెల తెలిపారు. వారంతా ఏప్రిల్ 21 వరకూ ఇళ్ళలోనే ఉండాలన్నారు. వారిపై వైద్య, పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. మర్కజ్ కేసులు తగ్గినా పరిస్థితిని తేలిగ్గా తీసుకోవద్దని సీఎం కెసీఆర్ సూచించారన్నారు.

Next Story
Share it