Telugu Gateway
Andhra Pradesh

రమేష్ కుమార్ తొలగింపు చెల్లదు!

రమేష్ కుమార్ తొలగింపు చెల్లదు!
X

కొత్త నియామకాలకే ఆర్డినెన్స్ వర్తింపు

స్పష్టం చేసిన న్యాయనిపుణులు

ఎస్ఈసీ ఖర్చుతో రమేష్ కుమార్ అప్పీల్ చేయవచ్చు

ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ ఎలాగైనా ఆయన్ను తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఎస్ఈసీని ముగ్గరు సభ్యుల కమిషన్ గా మార్చటంతోపాటు..రమేష్ కుమార్ పై వేటుకు గల అన్ని మార్గాలు మార్గాలు అన్వేషించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం..తొలగింపు అంశాలపై స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అందులో మాత్రం ఎక్కడా కాలపరిమితి గురించి ప్రత్యేకంగా ప్ర్రస్తావించలేదు. అయితే రమేష్ కుమార్ నియామకం విషయం వచ్చేసరికి ఆయన నియామకం సమయంలో గవర్నర్ ఇఛ్చిన ఆదేశాలు ఐదేళ్ల కాలపరిమితి లేదా 65 సంవత్సరాల వయస్సు ఏది ముందు అయితే అది మాత్రమే వర్తిస్తుంది అని పేర్కొన్నారు. అంటే ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ భవిష్యత్ లో చే సే నియామకాలకు చెల్లుబాటు అవుతుంది తప్ప...రమేష్ కుమార్ కు చెల్లుబాటు కాదని న్యాయనిపుణులు స్పష్టం చేశారు.

ఒకసారి రాజ్యాంగబద్దమైన పదవి అయిన ఎస్ఈసీలో గవర్నర్ ఐదేళ్లకు అని ఆదేశాలు ఇచ్చిన తర్వాత మార్పు చేయాలంటే పార్లమెంట్ లో అభిశంసించాలి తప్ప..రాఫ్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. కొత్తగా నియమించే ఎస్ఈసీ కాలపరిమితిని మూడేళ్లకు మార్చుకునే వెసులుబాటు ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ ఆర్డినెన్స్ తెచ్చేందుకు ముందు జగన్ సర్కారు రకరకాల మార్గాలు అన్వేషించింది. అందులో ముగ్గురు సభ్యుల కమిషన్ అంశాన్ని చాలా సీరియస్ గా పరిశీలించింది. అయితే రాజ్యాంగంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అని ఉంది కానీ..కమిషన్ అని లేకపోవటంతో ఈ ప్రతిపాదనపై సర్కారు వెనక్కి తగ్గింది.

అందుకే కాలపరిమితి మూడేళ్లకు మొగ్గుచూపుతూ ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. అయినా ఇది కూడా చెల్లుబాటు కాదని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో స్వయంగా ఎస్ఈసీ రమేష్ కుమార్ మాత్రమే కోర్టులో అప్పీలు చేయాల్సి ఉంటుందని..వేరే వాళ్లు చేసే అవకాశం లేదని ఓ న్యాయనిపుణుడు అభిప్రాయపడ్డారు. అంతే కాదు..కమిషన్ వ్యయంతోనే రమేష్ కుమార్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయవచ్చని..అందుకు వ్యక్తిగతంగా కూడా ఖర్చు భరించాల్సిన అవసరం ఉండదని ఆయన వెల్లడించారు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it