Telugu Gateway
Andhra Pradesh

చిక్కుల్లో సతీష్ చంద్ర..ఆ ప్రత్యేక టాస్క్ కాపాడుతుందా?!

చిక్కుల్లో సతీష్ చంద్ర..ఆ ప్రత్యేక టాస్క్ కాపాడుతుందా?!
X

సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర చిక్కుల్లో పడ్డారా?. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనపై సీరియస్ గా ఉన్నారా?అంటే ఔననే సమాధానం వస్తోంది అధికార వర్గాల నుంచి. రాష్ట్రంలోని యూనివర్శిటీల్లోని ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ల నియామకం వ్యవహారం ఇప్పుడు ఏపీలో ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. గత ప్రభుత్వాల్లోనూ ఇలాంటి నియామకాల్లో కొంత రాజకీయ జోక్యం ఉండేది. కాకపోతే ఈ సారి నియామకాలు అన్నీ సభ్యుల నైపుణ్యం, అనుభవం వంటి అంశాలపై కాకుండా పూర్తి స్థాయిలో రాజకీయ జోక్యంతో జరిగాయని వెల్లడైంది. ఎవరికి ఏ ఎంపీ సిఫారసు చేశారు..ఎవరికీ ఏ ఎమ్మెల్యే సిఫారసు చేశారు అనే అంశాలతో కూడిన ఫైలు ఒకటి బయటకు వచ్చింది. ఇది ఇఫ్పుడు మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలే కాకుండా జిల్లాల వైసీపీ నేతలు కూడా ఏకంగా యూనివర్శిటీల ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల నియామకానికి సిఫారసులు చేయటం చర్చనీయాంశంగా మారింది. విషయం ఏమిటంటే రాజకీయ నేతలు సిఫారసు చేయటం అనేది కొత్తేమీ కాకపోయినా..ఎవరికి ఎవరు సిఫారసు చేశారు..వారి లేఖలు అన్నీ కూడా ఫైలులో పెట్టడం ఇఫ్పుడు పెద్ద వివాదంగా మారిందని చెబుతున్నారు.

ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ పోస్టులకు అర్హులు, అర్హతలను చూసి నిపుణుల పేర్లను మాత్రమే ఈ పోస్టులకు సిఫారసు చేయాల్సిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి పూర్తిగా రాజకీయ నేతలు చేసిన సిఫారసులను ఆమోదించి ఆ ఫైలును ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రకు పంపారు. రాజకీయ నేతల సిఫారసులను యదాతధంగా ఆయన ప్రభుత్వానికి పంపటం ఓ తప్పు అయితే...ఎంతో సీనియర్ అధికారి అయిన సతీష్ చంద్ర కూడా వాటిని అలాగే కొనసాగించటం మరో పెద్ద పొరపాటు అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యా మండలి చేసిన సిఫారసులను ప్రభుత్వం పరిశీలించి ఓకే చేయాల్సి ఉంటుంది. కానీ సతీష్ చంద్ర తనకు అందిన నివేదికను ఓకే చేశారని చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో వెనకబడిన వర్గాలకు తాము 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఏకంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు అసెంబ్లీలో బిల్లు ఆమోదింపచేసింది. కానీ అమలు విషయానికి వచ్చేసరికి మాత్రం దానికి తూట్లు పొడుస్తున్నారు. సహజంగా ఎవరైనా రాజకీయ నేతల సిఫారసులు ఉంటే..రికార్డు కోసం వాటిని పక్కన పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఎంతో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సతీష్ చంద్ర రాజకీయ నేతల పేర్లు అన్నీ కూడా ఫైలులో పెట్టడం..అది బయటకు పోక్కటంతో వైసీపీ సర్కారు ఉలిక్కిపడింది. అధికార వర్గాల్లో కూడా ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పరిపాలన ఎంత సజావుగా సాగుతుందో ఈ ఘటన చెబుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఈ ఫైలు ఎక్కడ నుంచి మీడియాకు లీక్ అయిందనే అంశంపై కూడా అంతర్గతంగా విచారణ సాగుతోంది.

చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగిన సతీష్ చంద్ర జగన్ అధికారంలోకి వచ్చాక ఆలశ్యంగా అయినా అత్యంత కీలకమైన ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సీఎంవోలో ఉన్న కీలక అధికారి, సతీష్ చంద్రకు ఉన్న సాన్నిహిత్యంతో ఇది సాధ్యం అయిందని అధికార వర్గాల్లో ప్రచారం. మరి తాజా పరిణామాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెబుతున్నారు. అయితే సతీష్ చంద్రకు సర్కారులో ఉన్న కీలక నేతలు అత్యంత కీలకమైన టాస్క్ ను అప్పగించారని..దాని కోసం అయినా ఈ విషయంలో చూసీచూడనట్లు వదిలేస్తారని అభిప్రాయం కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది ఈ సిఫారసుల వ్యవహారం ప్రభుత్వానికి బాగా డ్యామేజ్ చేసినందున చర్యలు ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.

Next Story
Share it