Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ఆరోపణలకు పూనం ‘ఎండార్స్’

చంద్రబాబు ఆరోపణలకు పూనం ‘ఎండార్స్’
X

అధికార వర్గాల్లో కలకలం

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలను ఏపీ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సమర్ధించేలా మాట్లాడటం ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. తమ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన మెడిటెక్ జోన్ ప్రాజెక్టును తీసుకొస్తే జగన్ ప్రభుత్వం వచ్చాక అక్కడ నుంచి కంపెనీలు అన్నీ వెనక్కిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆయన ఆరోపణలను సమర్ధించేలా పూనం మాలకొండయ్య స్పందించిన తీరు ప్రభుత్వ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన పూనం మెడిటెక్ జోన్ నుంచి కంపెనీలు వెళ్లిపోయిన మాట వాస్తవమే అయినా..అందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కారణం కాదని...దీని వెనక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతోందని తెలిపారు. అంతే కాకుండా టెండర్లు ఫైనల్ కాక ముందే ఎంపిక చేసిన కంపెనీలకు మెడిటెక్ జోన్ లో టెస్ట్ కిట్స్ , వెంటిలేటర్స్ తయారీకి అనుమతి ఇవ్వటం ద్వారా స్కామ్ కు తెరలేపినట్లు ఆమె చెప్పకనే చెప్పారు. 80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ పనుల చేపట్టేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపొజల్ (ఆర్ఎఫ్ పీ)పిలిచారు.

ఆర్ఎఫ్ పీ కింద ప్రతిపాదనలు సమర్పించటానికి ఏప్రిల్ 10 వరకూ గడువు ఉంది. కానీ ఈ లోగానే కొన్ని సంస్థలకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అనుమతులు ఇఫ్పించి..తమ ఉత్పత్తులు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చారు. అంటే అసలు టెండర్లలో పనులు ఏ కంపెనీకి దక్కుతాయో తెలియకుండానే ఇదంతా చేశారంటే ఈ80 కోట్ల రూపాయల పనుల్లో స్కామ్ కు తెరలేపినట్లు స్పష్టంగా కన్పిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతే కాదు అసలు పూనం మాలకొండయ్యకు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖతో సంబంధం లేదు. అయినా సరే ఆమె సీఎం జగన్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుని మరీ ఈ అంశంపై స్పందించేందుకు అంత ఆసక్తి చూపించటం ఏమిటి అన్నది అర్ధం కావటంలేదనే వ్యాఖ్యలు అధికార వర్గాల నుంచే విన్పిస్తున్నాయి.

అంతే కాదు..గతంలో వైసీపీ విమర్శలు చేసిన జితేంద్రశర్మ ఎంతో ఉత్తముడు అంటూ పూనం విలేకరుల సమావేశంలో ప్రశంసలు కురిపించారు. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్య, అప్పటి మెడికల్ హెల్త్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న గోపీనాథ్ లు సర్కారు ఖజానాకు కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చారని ఏసీబీ నివేదిక ఇఛ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు వీళ్లను మాత్రం వదిలేసి..‘టార్గెట్’ చేసుకున్న వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటోంది.

Next Story
Share it