Telugu Gateway
Politics

రెచ్చగొడతారు..రెచ్చిపోవద్దు

రెచ్చగొడతారు..రెచ్చిపోవద్దు
X

సమస్యలను పక్కదారి పట్టించేందుకు కొంత మంది రెచ్చగొడతారు..కానీ జనసేన కార్యకర్తలు ఎవరూ రెచ్చిపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా రైతులు, కార్మికులు, చిన్నపాటి వ్యాపారులు ఇలా అన్ని వర్గాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత క్లిష్ట తరుణంలో ప్రజా సేవే ప్రధానంగా ముందుకు వెళ్దాం అన్నారు. గురువారం సాయంత్రం ప్రకాశం జిల్లా జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఒంగోలు, చీరాల, అద్దంకి, కందుకూరు తదితర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రైతాంగం సమస్యలు, కూలీల కష్టాలు, తాగు నీటి సరఫరాలో ఆటంకాల గురించి చర్చించారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారందరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిశాయి. అలాగే కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో రోగులకు, వ్యాధి అనుమానితులకు సరైన సేవలు, ఆహారం అందటం లేదనే సమస్యను మన నాయకులు తెలిపారు.

తప్పకుండా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్తాను. సమస్య పరిష్కారమే ప్రధానంగా పనిచేద్దాం. ఈ విపత్కర సమయంలో రాజకీయాల కంటే ప్రజా ప్రయోజనమే ముఖ్యంగా మనం పని చేద్దాం” అన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ప్రకాశం జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రజలకు ఇలాంటి తరుణంలో మనో ధైర్యం ఇవ్వాలి. అలాంటి ధైర్యాన్ని ఏ మేరకు ప్రభుత్వం ఇస్తుందో అర్థం కావడం లేదు. జనసేన నాయకులు, కార్యకర్తలు మారుమూల ప్రాంతాల్లో సైతం పేదలకు అవసరమైన నిత్యావసరాలు అందిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మిర్చి, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే రైతులు ఎన్నో ఇబ్బందులుపడుతున్నారు. అలాగే పొగాకు వేలం వేసే సమయం ఇది. ఆ రైతులకు సమస్యలు వస్తున్నాయి. జిల్లాలోని రైతాంగం సమస్యపై పార్టీ నాయకులు దృష్టి సారించాలి. అలాగే జిల్లా నుంచి వలసలు వెళ్ళినవారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి. చీరాల ప్రాంతంలో చేనేత రంగం ఉంది. అక్కడి చేనేత కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. వారికి ప్రభుత్వపరంగా సాయం సక్రమంగా అందుతుందో లేదో దృష్టిపెట్టాలి” అని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

Next Story
Share it