ఏపీలో కరోనా విస్తరణకు టీడీపీ స్లీపర్ సెల్స్!

తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కరోనా విస్తరణకు టీడీపీ స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నట్లు అనుమానం కలుగుతోందని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎంతకైనా దిగజారతారని అన్నారు. ఆయన సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇఫ్పటివరకూ అసలు కరోనా లేని ప్రాంతాల్లో కూడా వైరస్ వచ్చింది అంటే తమకు ఇదే అనుమానం కలుగుతోందని అన్నారు. నూతన ఎస్ఈసీ కనగరాజు కొద్ది రోజుల క్రితం గవర్నర్ హరిచందన్ ను కలవటం వల్లే రాజ్ భవన్ లో కరోనా వైరస్ వచ్చిందని టీడీపీ నేతలు ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇలాంటి నీచ రాజకీయాలలో అందె వేసిన చెయ్యి అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏ రాష్ట్రంలో లేని విదంగా కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్న విషయం కనిపించడం లేదా అని ఆయన అన్నారు . టిడిపి స్లీపర్ సెల్స్ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. తొలుత ఏపీలో కరోనా కేసులు నామమాత్రంగా ఉండగా..తర్వాత కాలంలో అనూహ్యంగా పెరిగిపోయాయి. అది ఎంతలా అంటే ఏకంగా తెలంగాణను కూడా ఏపీ కరోనా కేసుల విషయంలో దాటిపోయింది.



