Telugu Gateway
Andhra Pradesh

కోర్టులో చేసినట్లే..కాణిపాకంలో కూడా ప్రమాణం చేయాలి

కోర్టులో చేసినట్లే..కాణిపాకంలో కూడా ప్రమాణం చేయాలి
X

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ధ్వజమెత్తారు. ప్రతి వారం కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసినట్లు..కాణిపాకం దేవాలయంలో కూడా ప్రమాణం చేయటానికి విజయసాయిరెడ్డి సిద్ధంగా ఉండాలన్నారు. వైసీపీలాగా కులం, కుటుంబం, అవినీతిని వాడుకుని రాజకీయం చేయాల్సిన అవసరం బిజెపికి లేదన్నారు. కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఏపీలో వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందన్నారు. గతంలో చంద్రబాబు కూడా ఈ విధంగానే చేశారని విమర్శించారు. ‘‘విజయసాయి తన మాటకు కట్టుబడి ఉండి.. చంద్రబాబు నుంచి నాకు రూ.20 కోట్లు ముట్టాయని కాణిపాకం వినాయకుడి ఎదుట ప్రమాణం చేయాలి’’ అని కన్నా మరోసారి డిమాండ్ చేశారు.

లాక్‌డౌన్ ముగియగానే తేదీ నిర్ణయిస్తామని చెప్పారు. బీజేపీలో నిధుల దుర్వినియోగంపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అర్థ రహితం అన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి బీజేపీకి లేదన్నారు. విజయసాయి రెడ్డి జీవితం తెరిచిన పుస్తకమో కాదో ప్రజలకు తెలుసునని అన్నారు. ప్రభుత్వం నుంచి తాను వివరణ అడిగానని, కిట్స్ కు సంబంధించి వేర్వేరు ధరలపై ప్రశ్నించానని కన్నా పేర్కొన్నారు. తన ప్రశ్నలపై ప్రభుత్వం నుంచి కాకుండా విజయసాయిరెడ్డి ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా తిరగటం వల్లే కరోనా వైరస్ రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి దిశగా సాగుతోందన్నారు.

Next Story
Share it