Telugu Gateway
Telangana

దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్ లో

దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్ లో
X

తెలంగాణ మరో ప్రత్యేకతను సాధించింది. దేశంలోనే తొలి వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్ లో ఏర్పాటు అయింది. దేశాన్ని కరోనా కుదిపేస్తున్న తరుణంలో ఏర్పాటైన ఈ ల్యాబ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇప్పటి వరకూ కేవలం విదేశాల్లో ఉన్న ఈ తరహా ల్యాబ్ హైదరాబాద్ లో ఏర్పాటు కావటం విశేషం. నగరంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆన్ లైన్ ఈ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ పరిశ్రమలు, ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ పాల్గొన్నారు. ఐక్లీన్, ఐ సేఫ్ సంస్థల సహకారంతో డీఆర్ డీవో ఈ బయో సేఫ్టీ లెవల్ 3 ల్యాబ్ ను అభివృద్ధి చేసింది. డీఆర్ డీవో శాస్త్రవేత్తలు రికార్డు సమయంలో అంటే కేవలం 15 రోజుల్లో రెండు భారీ కంటైనర్లలో ఈ ల్యాబ్ ను సిద్ధం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన సాంకేతికతతో దీన్ని తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ... దేశంలోనే పీపీఈ కిట్లను తయారు చేస్తున్నామన్నారు. ఢిల్లీ మర్కజ్‌ ఘటన లేకుంటే కరోనా సంఖ్య ఇంత తీవ్రంగా ఉండేది కాదన్నారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. గబ్చిబౌలిలో 20 రోజుల్లోనే 1500 పడకలతో టిమ్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోవిడ్‌-19 చికిత్స కోసం 8 ప్రత్యేక హాస్పిటళ్లను ఏర్పాటు చేశామన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి వైద్య సహాయం అందిస్తున్నామని, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు.

Next Story
Share it