Telugu Gateway
Telangana

కరోనాతో ఓ వ్యక్తి మృతి..గాంధీ డాక్టర్లపై దాడి

కరోనాతో ఓ వ్యక్తి మృతి..గాంధీ డాక్టర్లపై దాడి
X

గాంధీ ఆస్పత్రిలో కలకలం. తెలంగాణలో కరోనా వైరస్ సోకిన బాధితులకు చికిత్స ఇస్తున్న ఆస్పత్రి ఇదే. ఇక్కడి డాక్టర్లు కరోనా కేసులను విజయవంతంగా ట్రీట్ చేసి పంపుతున్నారు. ఈ తరుణంలో గాంధీ డాక్టర్లపై దాడి ఘటన సంచలనంగా మారింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 50 ఏళ్ల కరోనా బాధితుడు మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 7కు చేరింది. అయితే అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం తెలుసుకున్న సీపీ అంజనీకుమార్‌ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. డాక్టర్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఈటెల ఆదేశాలు జారీ చేశారు.

నిర్మల్‌ కు చెందిన అన్నదమ్ముళ్లు కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. వీరిద్దరు కూడా ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా సమాచారం. అయితే చికిత్స పొందుతూ ఓ వ్యక్తి బుధవారం నాడు మరణించాడు. సోదరుడి మృతితో ఆగ్రహానికి లోనైన మరో వ్యక్తి వైద్యులపై దాడికి దిగాడు. ఈ ఘటనను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ తెలిపారు. ఇలాంటి కష్ట సమయంలో వైద్యులపై దాడి సరికాదని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆయన మంత్రిని కోరారు. డాక్టర్లపై దాడి ఘటనను మంత్రి ఈటెల రాజేందర్ తోపాటు పలువురు తీవ్రంగా ఖండించారు.

Next Story
Share it