మంచి నీళ్లు అనుకుని శానిటైజర్ తాగిన వైద్యాధికారి

ఆయన ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ వో). దేశమంతా కరోనా భయం వెంటాడుతుంటే అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ఇంట్లో, కారులో, ఆఫీస్ లో శానిటైజర్ లేకుండా గంట గడపటం లేదు. ఎందుకంటే కరోనా అందరినీ ఎంత టెన్షన్ పెడుతుందో తెలిసిందే కదా. అక్కడే ఓ చిక్కొచ్చి పడింది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో జిల్లా వైద్యాధికారి మంచినీళ్ళు అనుకుని శానిటైజర్ బాటిల్ నుంచి రెండు గుటకలు వేశారు.
తేడా గ్రహించి ఒకింత షాక్ కు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు అనంతపురం డీఎంహెచ్ వో అనిల్ కుమార్ ను ఓ ప్ర్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. డీఎంహెచ్ వోకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఇబ్బందికర పరిస్థితి ఏమీలేదని తెలిపారు. చికిత్స అనంతరం సాయంత్రంలోగా ఆయన్ను డిశ్చార్జి చేస్తామని తెలిపారు. డీఎంహెఛ్ వో ఆస్పత్రి పాలైన విషయం తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు ఆయన్ను పరామర్శించారు.