ఏపీలో ‘కరోనా కిట్స్ కిరికిరి’!

చత్తీస్ గడ్ రేటు337 ప్లస్ జీఎస్ టీ..ఏపీ రేటు 700 వరకూ
ఏపీ..చత్తీస్ గడ్ కిట్స్ మధ్య ధర తేడా 300 రూపాయలపైనే
ఈ లెక్కల తేడాలు ఏంటో?
ఎవరైనా ఎవరి నుంచైనా ఓ వస్తువు కొనాలంటే ముందు రేటు మాట్లాడుకుంటారు. రేటు ఓకే అయితేనే ఉత్పత్తిదారు వస్తువులు సరఫరా చేస్తాడు. కొనుగోలుదారు ఓకే అంటాడు. అది కూడా ఓ విదేశం నుంచి మరో దేశంలోని రాష్ట్రానికి అంటే ముందే ‘లెక్క’ తేలిపోతుంది. కానీ ఏపీ సర్కారు తీరు మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి దక్షిణ కొరియా నుంచి కరోనా పరీక్షల కోసం లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వచ్చాయి. అసలు రేటు ఖరారు కాకుండా దక్షిణ కొరియా లాంటి దేశంలోని ఓ కంపెనీ ఏపీకి కిట్స్ సరఫరా చేస్తుందా?. చేయటానికి అభ్యంతరాలు ఏమీ ఉండకపోవచ్చు. ముందు రేటు ఖరారు అవ్వాలి కదా?. కానీ ఈ అంశంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జనహర్ రెడ్డి ఇచ్చిన సమాధానలు విచిత్రంగా ఉన్నాయి. ఓ ఒక్కో కిట్ ధర 640 వరకూ ఉంటుందని తెలిపారు. చత్తీస్ గడ్ 337 రూపాయలకే కొనుగోలు చేస్తే ..తామూ అదే ధరకు కొంటామని వ్యాఖ్యానించినట్లు ఓ ప్రత్రిక వార్తను ప్రచురించింది. అంటే అసలు ధర ఎంతో తెలియకుండానే లక్ష కిట్లు కొన్నారా?. జవహర్ రెడ్డి వాదన విచిత్రంగా ఉందనే వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల నుంచే విన్పిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఏపీ సర్కారుకు చెందిన ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం ఏపీ ప్రభుత్వం ఒక్కో కిట్ ను సుమారు 700రూపాయలకు కొనుగోలు చేస్తోందని..సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు 1200 రూపాయలకు కాదని తెలిపారు. అదే సమయంలో కిట్ ధర సుమారు 700 రూపాయలు అంటూ తుది ధర కోసం సంప్రదింపులు జరుపుతామని ట్విట్టర్ లో పేర్కొన్నారు. అసలు విచిత్రం ఏమిటంటే దక్షిణ కొరియాలోని ఓ కంపెనీతో అసలు ఏపీ సర్కారు ధర అంశంపై చర్చించకుండానే లక్ష కిట్లు ఎలా తీసుకొచ్చింది?. అసలు అది సాధ్యం అవుతుందా?. చెల్లింపులు లేకుండా విదేశీ కంపెనీ ఏపీకీ అప్పు ఇస్తుందా?. చత్తీస్ గడ్ కొనుగోలు కిట్స్ ధర 337 రూపాయలు అయితే..ఏపీ కిట్స్ ధర ఏకంగా 700 రూపాయల వరకూ ఎలా పెరుగుతుంది అన్నది సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలాయి. చత్తీస్ గడ్ కిట్స్ కు..ఏపీ కిట్స్ కు మధ్య ధరలో తేడా 337 రూపాయలా?. ఇందులో ఏదో గోల్ మాల్ ఉందనే విమర్శలు విన్పిస్తున్నాయి.