Telugu Gateway
Telangana

కేసులు తగ్గటం శుభపరిణామం

కేసులు తగ్గటం శుభపరిణామం
X

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండటంశుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఒక్క కరోనా యాక్టివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారుతున్నాయని సిఎం ప్రకటించారు. కరోనా వైరస్ సోకిన వారిలో కూడా 97 శాతానికి పైగా పేషంట్లు కోలుకుని, డిశ్చార్జి అవుతుండడం మంచి పరిణామమన్నారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారి ద్వారా వైరస్ సోకుతున్న వారి లింక్ మొత్తం గుర్తించి, అందరికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం 159 మందికి పరీక్షలు నిర్వహించగా, కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. కొద్ది రోజులుగా పరిస్థితి గమనిస్తుంటే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక్క పాజిటివ్ కూడా రాని పరిస్థితి వస్తుందనే నమ్మకం ఏర్పడుతున్నది.

ఆ తర్వాత అక్కడో ఇక్కడో కొద్దో గొప్పో కేసులు వచ్చనా వెంటనే గుర్తించి, తగు చర్యలు తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన ప్రభుత్వం ఏమాత్రం ఉదాసీనంగా ఉండదు. ప్రతీక్షణం అప్రమత్తంగానే ఉంటాం. మళ్లీ ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చి, కేసుల సంఖ్య పెరిగినా సరే, సమర్థంగా ఎదుర్కోవడానికి అన్ని విధాలా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉంది. టెస్టింగ్ కిట్స్, పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు, ఇతర మాత్రలు, పరికరాలు, బెడ్సు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎన్ని కేసులొచ్చినా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చికిత్స చేయడానికి సర్వసన్నద్ధమయి ఉన్నాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ‘‘రాష్ట్రంలో ముందు ప్రకటించినట్లు మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలు నిబంధనలు పాటించి సహకరించాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. అన్ని మతాల వారు తమ ప్రార్థనా కార్యక్రమాలను, పండుగలను ఇండ్లలోనే చేసుకోవాలి. పాజిటివ్ కేసులు తగ్గుతున్న కొద్దీ, ఆక్టివ్ కేసులు లేని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గిస్తాం. కానీ కంటైన్మెంట్ కొనసాగుతున్న ప్రాంతాల్లో మాత్రం ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.

Next Story
Share it