Telugu Gateway
Politics

రైతు సమస్యలపై బండి సంజయ్ దీక్ష

రైతు సమస్యలపై బండి సంజయ్ దీక్ష
X

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రైతు సమస్యలపై ఉపవాసదీక్షకు దిగారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన దీక్షకు కూర్చున్నారు. బిజెపి నేతలు ఎవరి ఇళ్ళలో వారు దీక్షకు దిగాలని ఆయన కోరారు. రైతులకు గిట్టుబాటు ధర లభించటం లేదని..సర్కారు రైతులను ఆదుకోవటంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆయన ఈ దీక్షకు ఉపక్రమించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ రైతుల పంటను పూర్తిగా కొంటామని..ఎలాంటి ఇబ్బందిలేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. మిల్లర్లు చాలా చోట్ల రైతులను వేధిస్తున్నారని తెలిపారు. దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు కూడా చేయలేదని విమర్శించారు. మంత్రులు జిల్లాలకు వెళితే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.

కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వమే దళారీలను ప్రోత్సహిస్తోందని..కొన్ని చోట్ల అధికారులే దళారీలుగా మారారని ఆరోపించారు. సర్కారు చెబుతున్నట్లు ధాన్యం కొంటుంటే సిరిసిల్లలో రైతులు తాము పండించిన ధాన్యం ఎందుకు తగలపెట్టే పరిస్థితి వచ్చిందని ప్రశ్నించారు. లాక్ డౌన్ , భౌతిక దూరం పాటిస్తూ రైతులు నిరసన చెబుతుంటే వారిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకూ బండి సంజయ్ దీక్ష చేయనున్నారు.

Next Story
Share it