Telugu Gateway
Politics

ఈ సమయంలో రాజకీయ ప్రచారం చేయకూడదు

ఈ సమయంలో రాజకీయ ప్రచారం చేయకూడదు
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్టలు చేసిన ఫిర్యాదుపై ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఏపీలో ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో లేకపోయినా ప్రచారంపై మాత్రం నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పోటీచేసే అభ్యర్ధులు తమ స్వప్రయోజనాల కోసం ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేయకూడదన్నారు. ఇది ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు.

తమకు అందిన ఫిర్యాదులపై నిజనిజాలను పరిశీలించి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులకు లేఖలు రాశారు. కరోనా వైరస్ కారణంగా పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అందజేస్తున్న వెయ్యి రూపాయల సాయంపై రాజకీయ వివాదం నడుస్తోంది. కొంత మంది వైసీపీ తరపున పోటీచేసే అభ్యర్ధులే ఈ వెయ్యి రూపాయలు పేదలకు అందిస్తూ...ఇది సీఎం జగన్ ఇస్తున్నారని..తమకే ఓటు వేయాలని కోరుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Next Story
Share it