‘డబ్బింగ్ సినిమా’లా జగన్ సందేశం

ఒక భాషలో తీసిన సినిమాను మరో భాషలోకి డబ్బింగ్ చేసేటప్పుడు పాత రోజుల్లో చాలా సమస్యలు వచ్చేవి. వచ్చే డైలాగ్ లకు..పెదాలకు ‘సింక్’ అయ్యేది కాదు. అప్పట్లో అంటే పెద్దగా టెక్నాలజీ లేదు కాబట్టి అర్ధం చేసుకోవచ్చు. కానీ అదేమి విచిత్రమో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం పాత డబ్బింగ్ సినిమాలను గుర్తుకు చేసింది. ఆయన సందేశం ఆసాంతం సీఎం జగన్ నుంచి వచ్చే మాటలకు...లిప్ కు అసలు సింక్ కాలేదు. టీవీలు చూసిన ప్రేక్షకులు అందరూ ఒకింత ఆశ్చర్యపోయిన పరిస్థితి. గత కొన్ని రోజులుగా జగన్ విలేకరుల సమావేశాలు ఎత్తేసి..సందేశాత్మక వీడియోలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం కూడా అదే జరిగింది.
గతంలో విడుదల చేసిన వీడియోల్లో చాలా స్పష్టత ఉంది. కానీ తాజా సందేశంలో మాత్రం ఏ ఛానల్ లో చూసిన జగన్ పెదాల కదలికలు....వచ్చే మాటలకు మధ్య తేడా స్పష్టంగా కొట్టొచ్చినట్లు కన్పించింది. ఈ వ్యవహారం చూసిన మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఒకింత ఆశ్చర్యపోయిన పరిస్థితి. విచిత్రం ఏమిటంటే అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ లాంటి నగరం ఉన్న తెలంగాణతో పోలిస్తే తొలి రోజుల్లో అత్యంత తక్కువ కేసులతో ఉన్న ఏపీ ఇప్పుడు కరోనా విషయంలో తెలంగాణను అధిగమించేసింది. అయినా సరే జగన్ రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయగలిగామని తెలిపారు. కరోనా ఇప్పట్లో పోయేది కాదని..ప్రజలు అందరూ దీంతో కలసి జీవనం సాగించాల్సి ఉంటుందని ప్రకటించారు.



