Telugu Gateway
Politics

తెలంగాణ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తత..లాఠీచార్జ్

తెలంగాణ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తత..లాఠీచార్జ్
X

తెలంగాణ అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ముట్టడికి వచ్చిన విద్యార్ధులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో చాలా మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అధికారులు, మీడియా వాహనాలు వెళ్ళే ప్రధాన గేటు వరకూ పెద్ద ఎత్తున ఏబీవీపీ నాయకులు వచ్చారు. కొంత మంది గేటు దూకి అసెంబ్లీలోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తాము ఈ కార్యక్రమం తలపెట్టామని..ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని..యూనివర్శిటీల వైస్ ఛాన్స్ లర్స్ ను తక్షణమే నియమించాలని కోరుతూ ఈ కార్యక్రమం తలపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు.

ఈ తరుణంలో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 9 యూనివర్సీటీలకు వెంటనే వీసీలను నియమించాలని, ఖాళీగా ఉన్న 50వేల టీచర్ల పోస్టులను, జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని దాని వల్ల తమకు స్కాలర్ షిప్‌లు రావడం లేదని విద్యార్థులు మీడియాకు చెప్పారు. ఈ డిమాండ్ తీర్చడం కోసమే అంతా కలిసి అసెంబ్లీ ముట్టడికి యత్నించినట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఫీజు రీఎంబర్స్‌ మెంట్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Next Story
Share it